Inavolu Mallanna | ఐలోని మల్లన్న బ్రహ్మోత్సవాలకు వేళాయే.. జానపదుల జాతర విశేషాలు తెలుసా.. ?
Inavolu Mallanna Swamy Temple: కాకతీయుల కళా వైభవం ఉట్టిపడే మహిమాన్విత క్షేత్రం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం.. భక్తులు కోరిన వెంటనే కోర్కెలు తీర్చే కొంగుబంగారం, గొల్ల కురుమలు, ఒగ్గు కళాకారుల ఆరాధ్య దైవ్యంగా పూజలందుకుంటున్న ఐలోని మల్లన్న పుణ్యక్షేత్రం స్వామివారి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. జాన పదుల జాతరగా పిలిచే ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ఈనెల 13 నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానుండగా.. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ ఉత్సవాలకు సమీప జిల్లాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మల్లన్న స్వామిని దర్శించుకుంటారు. మరికొద్ది రోజుల్లోనే ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఐలోని మల్లన్న ఆలయ విశిష్టత గురించి మీరూ తెలుసుకోండి..
ఆలయ చరిత్ర
ఐనవోలు పుణ్యక్షేత్రాన్ని కాకతీయులు నిర్మించారనే పలువురు చెబుతుండగా చాళుక్యుల కాలంలోనే నిర్మించారని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. క్రీ.శ. 1,076 – 1,127 మధ్యకాలంలో ఓరుగల్లు ప్రాంతాన్ని పశ్చిమ చాళుక్య చక్రవర్తి, త్రిభువన మల్ల బిరుదాంకితుడు ఆరో విక్రమాదిత్యుడు పాలించగా.. ఆయన కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు శిలాశాసనాల ఆధారంగా చెబుతున్నారు. ఆరో విక్రమాదిత్యుడి ఆస్థానంలో మంత్రిగా ఉన్న అయ్యన్నదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు వాదిస్తున్నారు. ఆయన పేరు మీదనే ఈ ప్రాంతానికి ‘అయ్యనప్రోలు’ అనే పేరు రాగా.. కాలక్రమేణా అది కాస్తా అయినవోలు, ఐనవోలుగా మార్పు చెందింది. కాగా ఈ ఆలయం అష్టో త్తర స్తంభాలు, రాతితో చెక్కిన ప్రాకారాలు, విశాలమైన మండపాలతో ఒక రథాన్ని పోలి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఆలయం లోపల ప్రదక్షిణ మార్గం సైతం చాళుక్యుల కళానైపుణ్యానికి అద్దం పడుతోంది.
కాకతీయుల కాలంలో ఐనవోలు ఆలయానికి తూర్పు, దక్షిణ వైపున కీర్తితోరణాలను ఏర్పాటు చేశారు. కాకతీయుల వంశంలో రెండో ప్రోలరాజు కుమారుడు రుద్రదేవుడి కాలంలో వీటిని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. కాగా ఇక్కడి కీర్తితోరణాల విషయంలో పలు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కాకతీయ రెండవ ప్రోలరాజు ఒకరోజు వేయిస్తంభాల గుడిలో నిద్రిస్తున్న తన కొడుకు రుద్రదేవుడిడి పుత్రవాత్సల్యంతో తాకగా.. మగత నిద్రలో ఉన్న ఆయన తనను ఎవరో శత్రువులు చంపేందుకు వచ్చారని భ్రమపడి ప్రోలరాజును పొడుస్తాడు. దీంతో ప్రోలరాజు అక్కడికక్కడే మరణించగా.. తన తండ్రిని చంపిన దోషపరిహారార్థం ఆలయానికి రెండు వైపులా కీర్తి తోరణాలను నిర్మించినట్లు కొందరు చెబుతారు.
10 అడుగుల ఎత్తు, కోరమీసాలతో..
కాగా ఐలోని మల్లికార్జున స్వామిని మల్లన్న అని, మైలారు దేవుడని, ఖండేల్ రాయుడని, వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు. కాగా ఆలయంలో స్వామివారి విగ్రహం సుమారు 10 అడుగుల ఎత్తులో కోరమీసాలతో జీవకళ ఉట్టిపడినట్లుగా ఉంటుంది. నాలుగు చేతుల్లో ఖడ్గం, త్రిశూలం, ఢమరుకం, పానపాత్రలు ఉంటాయి. స్వామివారికి ఇరువైపులా దేవేరులైన గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ కొలువుదీరి ఉంటారు. ఇక మల్లన్న స్వామి కుడి కాలు కింద ఆయన చేతిలో హతమైన మణి, మల్లాసురులు అనే రాక్షసుల శిరస్సులను చూడవచ్చు.
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
జానపదుల జాతర..
ఐలోని మల్లన్న గొల్ల, కురుమలకు ఇష్టదైవం. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి ప్రత్యేకంగా వండిన బోనాన్ని సమర్పించుకుంటారు.ఒగ్గు పూజారులుగా పిలిచుకునే కురుమ పూజారులు బండారి (పసుపు) తో పట్నాలు వేసి, ఢమరుకం నాదాలకు జానపద బాణీలో స్వామివారి కథా గానం చేస్తుంటారు. భక్తులు గజ్జెల దుస్తులు ధరించి, నెత్తిన బోనం, చేతిలో కొరడా (చర్నాకోల)లతో భక్తిపారవశ్యంతో నాట్యం చేస్తుంటారు. శివసత్తులు సైతం మల్లన్నను తలుచుకుంటూ శివాలూగుతుండడం ఇక్కడ చూడవచ్చు. గిరిజన తండాలు, పల్లె ప్రజల సందడి ఎక్కువగా ఉండడం, ఆలయ ఆవరణ అంతా ఒగ్గు పూజారుల ఢమరుక నాదాలు, పసుపు బండారి పట్నాలు, గజ్జెల లాగుల నృత్యాలు ఎటుచూసినా కనిపిస్తుండడం వల్ల ఈ జాతరను జానపదుల జాతరగా పేరు వచ్చింది. కాగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరూ దండ దీపాలు పెట్టి, కోడె మొక్కులు చెల్లించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుయడం ఇక్కడి ఆనవాయితీ..
మహాశివరాత్రి నుంచే కోలాహలం
మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆలయ అర్చకులు ధ్వజారోహణం చేసి మల్లన్నస్వామివారిని, అమ్మవార్లను నూతన వస్ర్తాలతో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. మల్లికార్జునస్వామి వారిని పాంచాహ్నిక దీక్షతో ఐదు రోజులపాటు అశ్వవాహనం, నంది వాహనం, పర్వత వాహనం, రావణ వాహనాలపై అధిరోహించి చివరి రోజున స్వామివారికి పురవీధి సేవ నిర్వహిస్తారు. ఐదో రోజున ఎంతో ప్రతిష్టాత్మకంగా అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహిచి ఆ తర్వాత వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించి, ఆ తర్వాత శ్రీపుష్ప యాగంతో ఈ ఉత్సవాలను ముగిస్తారు.
మూడు నెలల పాటు ఉత్సవాలు
మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఏటా మూడు నెలల పాటు జరుగుతాయి. మకర సంక్రాంతి సందర్భంగా భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ మూడు రోజులపాటు సమీప జిల్లాలు, రాష్ట్రాల నుంచి దాదాపు 10లక్షల మంది వరకు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా.. ఆ తర్వాత ఉగాది వరకు ప్రతీ ఆది, బుధవారాల్లో స్వామివారి జాతర ఘనంగా కొనసాగుతుంది. ఆయా రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి తరలివస్తుంటారు. స్వామివారికి పెద్దపట్నాలు వేసి, కల్యాణం జరిపించడంతో పాటు బోనాలను కూడా సమర్పిస్తారు. గజ్జెల దుస్తులు ధరించి జానపద న్రుత్యాలు చేస్తుంటారు. ఒగ్గుపూజారులు స్వామివారి కథా గానంతో పాటు ఢమరుకం, డోలు వాయిద్యాలతో భక్తులకు పూనకాలు తెప్పిస్తారు.
జనవరి 13 నుంచి మల్లన్న జాతర
ఈనెల 13 నుంచి ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఈ వేడుకలు కొనసాగుతాయి. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల కోసం అధికారులు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. మల్లన్న జాతరకు తెలంగాణ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు.
Inavolu Mallanna Swamy Temple వరంగల్ జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వరంగల్, హన్మకొండ, ఖమ్మం నుంచి ఇక్కడికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. జాతర సమయంలో ప్రత్యేక బస్సులను కూడా నడిపిస్తుంటుంది. నిత్యం ప్రైవేటు వాహనాలు కూడా తిరుగుతుంటాయి. భక్తులు ఇక్కడ విడిది చేసేందుకు దాతల సహకారంతో మల్లన్న సదన్ నిర్మిస్తున్నారు. కానీ ఈ పనులు ఇంకా పూర్తికాలేదు.ఒకవేళ అక్కడ ఒక్క రోజైనా గడపాలనుకునే భక్తులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటే మేలు. ఇక కొద్ది రోజుల్లోనే మల్లన్న జాతర ప్రారంభం కానుండగా ఇప్పటి నుంచే స్వామివారి సేవ కోసం భక్తులు కూడా భారీగా వస్తున్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..