దట్టమైన అడవి మీదుగా శ్రీశైల మల్లన్నకు.. హైదరాబాద్ – శ్రీశైలం మధ్య 55 కి.మీ. భారీ ఫ్లై ఓవర్!
Elevated Corridor Srisailam : ప్రసిద్ధ శ్రీశైల మల్లన్న స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం రోడ్డు మార్గంలో పెద్ద పెద్ద కొండలు, ప్రమాదకరమైన మలుపులు దాడుకుని వెళ్లడం ఎంతో కష్టంగా ఉండేది. హైదరాబాద్ దాటగానే చుట్టూ దట్టమైన నల్లమల అడవిలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రమాదకరమైన మలుపుల మధ్య వాహనాల వేగం మాత్రం 30 నుంచి 40 కిలోమీటర్లు దాటడానికి వీలు లేదు. ఒకవేళ వాహన వేగం పెరిగితే జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి. పైగా రాత్రివేళల్లో ప్రయాణం పూర్తిగా నిషేధం. మరోవైపు దట్టమైన కీకారణ్యం మధ్య సొంత వాహనాల్లో వెళ్లాలంటే వన్యప్రాణుల భయం కూడా ఉంది. ఇలాంటి సమస్యల నుంచి భక్తులకు విముక్తి కల్పించేందుకు తెలంగాణ సర్కారు కొత్త ప్రతిపాదన చేసింది. 55 కిలోమీటర్ల పొడవైన భారీ వంతెన (Elevated Corridor Srisailam Highway) ను నిర్మించాలని యోచిస్తోంది.
ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే మన్ననూరు చెక్‌పోస్టు నుంచి ఏకంగా ఈ 55 కిలోమీటర్ల భారీ వంతెన మీదుగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి నేరుగా వెళ్లవచ్చు. అది కూడా దట్టమైన అడువుల అందాలను వీక్షిస్తూ సరికొత్త అనుభూతితో నేరుగా శ్రీశైలాన్ని చేరుకోవచ్చు. ఈ వంతెన వల్ల చెక్ పోస్టులు, వాహన వేగపరిమితులు ఏవీ ఉండవు ఫలితంగా ప్రయాణ సమయం కూడా చాలావరకు తగ్గిపోనుంది.
తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం
Elevated Corridor Srisailam Highway : హైదరాబాద్-శ్రీశైలం-నంద్యాల జాతీయ రహదారి నంబరు 765 తెలంగాణ, ఏపీ మధ్య అత్యంత కీలకమైన రహదారిగా ఉంది. ఈ హైవే మీదుగా హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రహదారి తుక్కుగూడ, ఆమనగల్లు, దిండి, మన్ననూరు మీదుగా సాగుతుంది. అలాగే తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లి రావడానికి కూడా ఈ హైవేనే కీలకం.. ఈ హైవే ఎక్కువగా నల్లమల అటవీ ప్రాంతం మధ్యలో నుంచే సాగుతుంది. ఇదే మార్గంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వుపార్కు ఉంది. ఫలితంగా పెద్ద పులులు, ఇతర వన్య ప్రాణులు సంచరిస్తుంటాయి. అందుకే ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణకు ప్రభుత్వాలు ఎన్నో విధాలుగా ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఈ సమస్యలన్నింటకీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని భావిస్తోంది. ఈ మార్గంలోని హైవేలో ఏకంగా 55 కిలోమీటర్ల పొడవున వంతెన నిర్మించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కేంద్ర ఉపరితల రవాణా శాఖకు, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి ఇటీవలే నివేదిక సమర్పించారు.
చెక్ పోస్టులు లేకుండా నేరుగా..
హైదరాబాద్-శ్రీశైలం రహదారిలో ఘాట్ రోడ్డు మొదలయ్యే చోటు మన్ననూరు చెక్పోస్తుకు ముందున్న బ్రాహ్మణపల్లి నుంచి ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ కారిడార్ దోమలపెంట తర్వాత వచ్చే పాతాళగంగ (తెలంగాణ సరిహద్దు) వద్ద ముగిసిపోతుంది. ఈ కారిడార్ ఘాట్ రోడ్డులో అమ్రాబాద్ అభయారణ్యం మీదుగా సాగుతుంది. ఈ ప్రతిపాదన అందుబాటులోకి వస్తే.. 55 కిలోమీటర్లతో తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద వంతెనగా నిలుస్తుంది. దీని నిర్మాణానికి వ్యయం రూ.7 వేల కోట్లుగా అంచనా వేశారు.. మన్ననూరు-ఫర్హాబాద్ జంగిల్ సఫారీ-వటవర్లపల్లి-దోమల పెంట మీదుగా ఎలివేటర్ కారిడార్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే.. డీపీఆర్ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..