ఘోర ప్రమాదం : బస్సులో మంటలు వ్యాపించి 25 మంది సజీవ దహనం
మహారాష్ట్రలో శనివారం తెల్లారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. పూణెకు వెళుతున్న బస్సులో మంటలు చెలరేగడంతో ముగ్గురు పిల్లలు సహా 25 మంది మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
శనివారం తెల్లవారుజామున నాగ్‌పూర్ నుంచి పూణెకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బుల్దానా జిల్లాలోని సింధ్‌ఖేడ్రాజా సమీపంలో ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న స్తంభాన్ని ఢీకొనడంతో బస్సు బోల్తాపడి మంటలు అంటుకున్నాయని పోలీసులు తెలిపారు. టైరు పగిలిపోవడంతో బస్సు స్తంభాన్ని ఢీకొట్టిందని ఘటనలో ప్రాణాలతో బయటపడిన బస్సు డ్రైవర్ చెప్పాడు. కాగా తెల్లవారుజామున సుమారు 1.30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
బస్సులో సుమారు 33 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్‌తో సహా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు బుల్దానా పోలీసు సూపరింటెండెంట్ సునీల్ కడసానే తెలిపారు.ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేస్తూ, క్షతగాత్రులకు ప్రభుత్వం చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.