బెంగళూరు టెకీ-మోడల్ ఆత్మహత్య.. నిందితుడిని పట్టించిన డైరీ
Bengaluru: బెంగళూరుకు చెందిన టెక్కీ/ మోడల్ ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని ఆమె రాసుకున్న డైరీ పట్టించింది. డైరీలో ఆమె పేర్కొన్న ఆధారాలతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు
బెంగళూరులో మరణించిన మోడల్ తనకు ఎదురైన వేధింపుల వివరిస్తూ డైరీలో పూర్తి వివరాలను రాసింది. విచారణలో భాగంగా ఆ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో వివరాల ఆధారంగా ఆమె ప్రియుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..
స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఉత్తర బెంగళూరులోని కెంపపురాలో జూలై 21న బాధితురాలు విద్యాశ్రీ ఆత్మహత్యకు పాల్పడింది. డైరీలో బాధితురాలు తన మరణానికి ప్రియుడే కారణమని పేర్కొంది. దీంతో 27 ఏళ్ల జిమ్ ట్రైనర్ అక్షయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
డైరీలో ఏముంది?
డైరీలో, బాధితురాలు అక్షయ్ తనతో “కుక్కలాగా ప్రవర్తించాడు” అని పేర్కొంది. తనకు చెల్లించాల్సిన సుమారు 1.76 లక్షల మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడని, నిందితుడు తన తల్లిదండ్రులను కూడా దుర్భాషలాడాడని, దీంతో తాను డిప్రెషన్‌కు గురయ్యానని బాధితురాలు పేర్కొంది.
‘రోజురోజుకు నేను ఒత్తిడికి లోనవుతున్నాను’ అని బాధితురాలు డైరీలో పేర్కొంది. “అమ్మ, గురు, మను – నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి. అలాగే, అమ్మాయిలందరికీ నా వినయపూర్వకమైన విన్నపం: ఎవరినీ ప్రేమించవద్దు. ఈ ప్రపంచానికి వీడ్కోలు.” అని డైరీలో తన చివరి వ్యాఖ్యలు రాసింది.
వీరిద్దరూ ఎలా కలిశారు?
విద్యాశ్రీ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) పూర్తిచేశారు. ఆమె ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తూ మోడలింగ్‌లో కూడా రాణిస్తోంది. ఈ క్రమంలో అక్షయ్ ఆమె అభిమానిగా పోజులిచ్చి బాధితురాలిని ఫేస్‌బుక్‌లో కలిశాడు. వీరి మధ్య పరిచయం పెరిగి డేటింగ్ ప్రారంభించారు. విద్యాశ్రీ నుంచి అక్షయ్ తరచు అప్పుగా డబ్బులు తీసుకునేవాడని, తిరిగి ఇవ్వలేదు. మూడు నెలల క్రితం ఈ జంట విడిపోవడంతో అక్షయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.