Jammu Kashmir zero terror plan | జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడుల తర్వాత శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ మారథాన్ సమావేశంలో కాశ్మీర్ లోయలో గతంలో అమలు చేసిన విజయవంతమైన ‘ఏరియా డామినేషన్ ప్లాన్’ ‘జీరో టెర్రర్ ప్లాన్’లను జమ్మూ డివిజన్‌లో పునరావృతం చేయాలని హోం మంత్రి భద్రతా ఏజెన్సీలను ఆదేశించారు.
జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితులపై హోంమంత్రికి సమగ్ర వివరణ ఇచ్చారు. మిషన్ మోడ్‌లో పని చేయాలని, సమన్వయంతో పనిచేసి త్వరితగతిన ప్రతిస్పందించాలని అమిత్ షా అన్ని భద్రతా ఏజెన్సీలను ఆదేశించారు. ఉగ్రవాదం అత్యంత వ్యవస్థీకృత తీవ్రవాద హింసాత్మక చర్యల నుంచి కేవలం ప్రాక్సీ వార్‌గా పరమితమైనట్లు ఇటీవలి సంఘటనలను బట్టి తెలుస్తోందని అన్నారు.
భద్రతా బలగాలు రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో తీవ్రవాదాన్ని సమూలంగా అరికట్టేందుకు పటిష్ట చర్యలుతీసుకోవాలని భావిస్తున్నాయి.
హోం మంత్రి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఆర్మీ చీఫ్‌గా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరో తపన్ దేకా, CRPF డైరెక్టర్ జనరల్ అనిష్ దయాల్ సింగ్, BSF DG నితిన్ అగర్వాల్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ RR స్వైన్, ఇతర ఉన్నత భద్రతా అధికారులు పాల్గొన్నారు.
మోదీ కీలక సూచనలు..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇదే అత్యున్నత స్థాయి చర్చ జరిపిన మూడు రోజులకే నార్త్ బ్లాక్‌లో ఈ సమావేశం జరిగింది. యాత్రికులను తీసుకెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు జరిపిన ఘోరమైన దాడితో సహా వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో “ఉగ్రవాద వ్యతిరేక భద్రతా బలగాల పూర్తి స్పెక్ట్రమ్”ను మోహరించాలని ప్రధాని అధికారులను ఆదేశించారు.
వరుస ఉగ్రదాడులు..
గత వారం నాలుగు రోజుల వ్యవధిలో రియాసి, కతువా, దోడా జిల్లాల్లోని నాలుగు ప్రదేశాలలో ఉగ్రవాదులు దాడి చేశారు , ఫలితంగా తొమ్మిది మంది యాత్రికులు, ఒక CRPF జవాన్ ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు భద్రతా సిబ్బంది, అనేక మంది పౌరులు గాయపడ్డారు. కతువా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు అనుమానిత పాకిస్థాన్ ఉగ్రవాదులు హతమయ్యారు.
జూన్ 9న, శివ్ ఖోరీ ఆలయం నుంచి కత్రాకు యాత్రికులు ప్రయాణిస్తున్న 53 సీట్ల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ నుండి యాత్రికులతో వెళ్తున్న బస్సు, తుపాకీ కాల్పుల తర్వాత లోతైన లోయలోకి పడిపోయింది. తొమ్మిది మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు.
ఆ తరువాత జూన్ 11న భదర్వాలోని చటర్‌గల్లా వద్ద రాష్ట్రీయ రైఫిల్స్ పోలీసుల జాయింట్ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. జూన్ 12న దోడా జిల్లాలోని గండో ప్రాంతంలో సెర్చ్ పార్టీపై దాడి చేయగా ఒక పోలీసుతో సహా ఏడుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
దక్షిణ కాశ్మీర్ హిమాలయాలలో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ పుణ్యక్షేత్రానికి వార్షిక తీర్థయాత్ర జూన్ 29న ప్రారంభమై ఆగస్ట్ 19 వరకు కొనసాగుతుంది. ఈ సంవత్సరం, అమర్‌నాథ్ యాత్రికులందరికీ RFID కార్డులు జారీ చేయనున్నారు. ప్రతి యాత్రికుడికి ₹ 5 లక్షలు, యాత్రికులను తీసుకువెళ్లే ప్రతి జంతువుకు ₹ 50,000 బీమా రక్షణ ఉంటుంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..