ఆకతాయిలకు షాక్ ఇచ్చే చెప్పులు ఇవి..
- మహిళల కోసం ఎలక్ట్రిక్ చెప్పులు
- ఇంటర్ విద్యార్థి ఘనత
ఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట మహిళలపై హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, భౌతిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయాల్లో వారిని కాపాడేందుకు పక్కన ఎవరూ లేకపోతే మహిళలు దుండగుల దాడులు చేసేవారికి బలవ్వాల్సిందే. అయితే ఇలాంటి ప్రమాదాల బారి నుంచి తప్పించుకునేందుకు ఒక యువకుడు చక్కని ఆవిష్కరణ చేశాడు.. ఇక నుంచి మహిళలు/ యువతులు వారు వేసుకునే చెప్పులతోనే రక్షించుకునేలా ఒక డివైజ్ కనుగొన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఝార్ఖండ్ రాష్ట్రం లోని ఛత్రాకు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి మంజీత్.. ‘విమెన్ సేఫ్టీ డివైజ్’ పేరుతో ఎలక్ట్రిక్ చెప్పులను రూపొందించాడు. మహిళలు, బాలికలపై ఎవరైనా దాడులకు పాల్పడితే వారు వేసుకున్న ఈ ఎలక్ట్రిక్ చెప్పులతో ఆ ఆకతాయిలను తంతే వారికి కరెంట్ షాక్ కు గురై అక్కడికక్కడే కింద పడిపోతారు. దీనివల్ల ఇతరుల సాయం లేకుండానే మహిళలు తమను తాము రక్షించుకోవచ్చని మంజీత్ వెల్లడించారు. ఎలక్ర్టిక్ చెప్పులు అనగానే వాటి ధర ఎంతో ఉంటుందని అనుకోవచ్చు.. కానీ వీటి ధర కేవలం రూ.500 మాత్రమే.. సాధారణంగా మనం వేసుకునే లేడిస్ చెప్పులనే ముడిసరుకుగా ఉపయోగించుకొని వాటి కింది భాగంలో నాలుగు బ్యాటరీలు, స్విచ్ సహా మరికొన్ని చిన్న పరికరాలను అమర్చి ఈ ఎలక్ర్టిక్ చెప్పులను తయారు చేశాడు. అలాగే ఈ డివైజ్ కు అర గంట ఛార్జింగ్ పెడితే రెండు రోజుల వరకు హాయిగా తిరగొచ్చని మంజీత్ పేర్కొన్నాడు. ఈ చెప్పులు తయారు చేసేందుకు ఒక వారం రోజుల సమయం పట్టిందని.. నిర్భయ వంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు తాను ఈ ఎలక్ట్రిక్ చెప్పులు రూపొందించినట్లు చెప్పాడు.