Wednesday, January 28"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Water Crisis | ఢిల్లీలో తీవ్రమైన నీటి సంక్షోభం, ట్యాంకర్ల వ‌ద్ద ప్ర‌జ‌ల‌పై పెనుగులాట

Spread the love

Water Crisis in Delhi | న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా తీవ్రమైన‌ నీటి ఎద్దడి నెలకొంది. నీళ్ల కోసం స్థానికులు నీటి ట్యాంకర్లను వెంబడించడం.. ట్యాంక‌ర్ల వ‌ద్ద నీటి కోసం పెనుగులాట‌లు, కొట్లాట వంటి దృశ్యాలు స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయాయి. ఢిల్లీలో నీటి కొర‌తకు సంబంధించి వార్తా సంస్థ ANI షేర్ చేసిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. నివాసితులు నీటి ట్యాంక‌ర్ల వెంట‌ వెనుక పరుగెత్తడం, అధికారులు పంపిన ట్యాంకర్‌లపై ఎక్క‌డం.. తమ బిందెలు, క్యాన్ల‌తో పొడవైన క్యూలలో వేచి ఉండ‌డం వంటివి ఈ వీడియోల్లో చూడ‌వ‌చ్చు. ఎండవేడిమిలో నీటి కోసం ప్రజలు అల్లాడుతుండడం చూసి అంద‌రూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ నిరసన

ఢిల్లీ కాంగ్రెస్ (Congress) , చీఫ్ దేవేందర్ యాదవ్ నాయకత్వంలో పార్టీ కార్య‌క‌ర్త‌లు మట్టి కుండలను నేలపై పగులగొట్టి శనివారం నగరవ్యాప్తంగా నిరసన లు నిర్వహించారు. దిల్లీలోని మొత్తం 280 బ్లాకుల్లో ఉదయం 10 గంటలకు నిరసనలు జ‌రిగాయి. తలపై మట్టి కుండలు, కాంగ్రెస్ జెండాలను పట్టుకుని నిరసనకారులు ఢిల్లీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కుండలను నేలపై విసిరికొట్టారు. నిరసనల సంద‌ర్భంగా దేవేంద్ర‌ యాదవ్ మాట్లాడుతూ.. ఈ అంశంపై చర్చించడానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత 20 నుంచి 25 రోజులుగా నీటి కొరత సమస్యను ప్ర‌భుత్వ దృష్టికి తీసుకువెళ్తున్నామ‌ని యాదవ్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం ప్రజల కష్టాలను నిర్లక్ష్యం చేస్తోంద‌ని ఆయన ఆరోపించారు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *