
Waqf Bill | న్యూఢిల్లీ: 2025 వక్ఫ్ (సవరణ) చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల జాబితాను పరిశీలించడానికి సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. జమియత్ ఉలేమా-ఎ-హింద్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలను ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విన్నది. ఈ పిటిషన్లు చాలా ముఖ్యమైనవని. వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. ప్రాధన్యతను బట్టి అన్నింటిని పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.
బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025కు శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించింది. గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో, వక్ఫ్ చట్టం, 1995 పేరును యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ (UMEED) చట్టం, 1995గా కూడా మార్చారు.
ఇస్లామిక్ మత నాయకుల సంస్థ అయిన జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ దాఖలు చేసిన పిటిషన్‌ను కపిల్ సిబల్ ప్రస్తావించారు. అత్యవసర విచారణ కోసం ఈమెయిల్స్ పంపే విధానం ఉన్నప్పుడు మౌఖిక ప్రస్తావన ఎందుకు చేస్తున్నారని సిబాల్‌ను సిబాల్‌ను ప్రశ్నించారు. అది ఇప్పటికే పూర్తయిందని సిబల్ పేర్కొన్నపుడు మధ్యాహ్నం దానిని పరిశీలించి అవసరమైన చర్య తీసుకుంటానని CJI చెప్పారు. ఎమ్మెల్యే అసదుద్దీన్ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయవాది నిజాం పాషా ప్రస్తావించారు. అదనంగా, వక్ఫ్ బిల్లును సవాలు చేస్తూ మరో మూడు పిటిషన్లు రాష్ట్రపతి ఆమోదానికి ముందే దాఖలు అయ్యాయి.
Waqf Bill ను రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించిన కాంగ్రెస్
పార్లమెంటు వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025ను ఆమోదించిన వెంటనే , ఆ సవరణలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వక్ఫ్ (సవరణ) బిల్లును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇది రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంపై దాడి అని, మతం ఆధారంగా దేశాన్ని విభజించడమే దీని లక్ష్యం అని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో పార్టీ విప్ మహ్మద్ జావేద్ తన పిటిషన్‌లో, ఈ సవరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), 25 (మతాన్ని ఆచరించే, ప్రచారం చేసే స్వేచ్ఛ), 26 (మతపరమైన వర్గాలు తమ మతపరమైన వ్యవహారాలను నిర్వహించుకునే స్వేచ్ఛ), 29 (మైనారిటీల హక్కులు), 300A (ఆస్తి హక్కు) లను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు.
మత స్వేచ్ఛను హరించడానికి కుట్ర: జమైత్
ఈ చట్టం దేశ రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి అని, ఇది తన పౌరులకు సమాన హక్కులను అందించడమే కాకుండా వారికి పూర్తి మత స్వేచ్ఛను కూడా అందిస్తుందని జమియత్ ఉలామా-ఎ-హింద్ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ బిల్లు ముస్లింల మత స్వేచ్ఛను హరించే కుట్ర అని జమియత్ పేర్కొంది. అదే విధంగా ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అక్బరుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టును ఎవరు ఆశ్రయించారు?
AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్టంలో సవరణల చెల్లుబాటును సవాలు చేశారు. కానీ ముందుగా కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్ ఏప్రిల్ 4న పిటిషన్ దాఖలు చేశారు. కేరళకు చెందిన సున్నీ ముస్లిం పండితుల మత సంస్థ సమస్త కేరళ జమియత్-ఉల్ ఉలేమా, ఎన్జీఓ అసోసియేషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, న్యాయవాది జుల్ఫికర్ అలీ పిఎస్ ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేశారు. జమియత్ ఉలేమా-ఎ-హింద్ కపిల్ సిబల్ ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేశారు.
వక్ఫ్ చట్టం పేద ముస్లింలకు మేలు : కేంద్రం
ఈ చట్టం కోట్లాది మంది పేద ముస్లింలకు ప్రయోజనం చేకూరుస్తుందని, ఇది ఏ ముస్లింకు కూడా హాని కలిగించదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ చట్టం వక్ఫ్ ఆస్తులలో జోక్యం చేసుకోదని మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మోడీ ప్రభుత్వం ‘సబ్ కా సాథ్ అండ్ సబ్ కా వికాస్’ అనే దార్శనికతతో పనిచేస్తుందనిపేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.