ఇటివల మన దేశంలో ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు విదేశాల్లోనూ భారీగా క్రేజ్ వస్తోంది. ఇప్పుడు వీటిని కొనుగోలు చేసేందుకు పలు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీనికి కారణం ఏమిటో తెలుసా..?
మనదేశంలో తక్కువ ఖర్చుతో తయారైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు(vande bharat express trains) ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా డిమాండ్ పెరుగుతోంది. మలేషియా, చిలీ, కెనడా వంటి దేశాలు మన నుంచి వందే భారత్ రైళ్లను దిగుమతి చేసుకోవడానికి ముందుకు వస్తున్నాయి . బయటి కొనుగోలుదారులు వందే భారత్ వైపు ఆకర్షితులవడానికి అనేక కారణాలు ఉన్నాయని కూడా ఆయా వర్గాలు చెబుతున్నాయి అందులో ముఖ్యమైనది ఒకటి ఖర్చు. ఇతర దేశాల్లో తయారయ్యే ఇలాంటి రైళ్ల ధర దాదాపు రూ. 160-180 కోట్లు ఖర్చు అవుతుండగా, ఇక్కడ వందే భారత్ రైలు రూ. 120-130 కోట్లతోనే అభివృద్ధి చేస్తున్నారు. దీంతో వారికి సుమారు 40 నుంచి 50 కోట్లు ఆదా అవుతుంది..
ఆకట్టుకునే స్పీడ్..
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు స్పీడ్ కూడా అద్భుతంగా ఉంటుంది. వందేభారత్ ట్రైన్ ప్రస్తుతం 0 నుంచి 100 కి.మీ వేగాన్ని కేవలం 52 సెకన్లలోనే అందుకుంటుంది . ఈ విషయంలో జపాన్ బుల్లెట్ రైలు కంటే వందే భారత్ రైలు బెటర్. జపాన్ ట్రైన్ 0-100 kmph వేగానికి చేరుకోవడానికి 54 సెకన్లు పడుతుంది. దీంతో పాటు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు డిజైన్ అందరిని విశేషంగా కట్టుకుంటుంది. మరో ఆశ్చర్యకరమైన విశేషమేమిటంటే ఇది విమానం కంటే 100 రెట్లు తక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీని శక్తి వినియోగం కూడా తక్కువ కావడంతో పలు దేశాలు ఈ ట్రైన్లపై ఇంట్రెస్ట్ చూపుతున్నాయి.
రైళ్ల సంఖ్య పెంపు..
కాగా భారతీయ రైల్వే తన ట్రాక్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. అలాగే వందే భారత్ రైళ్లను కూడా పెంచుతుంది గత పదేళ్లలో 31,000 కిలోమీటర్లకు పైగా ట్రాక్‌లను ఆధునీకరించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల వెల్లడించారు . త్వరలో 40,000 కిలోమీటర్ల అదనపు ట్రాక్‌ను ఆధునీకరిస్తామని తెలిపారు. మరికొన్ని వందే భారత్ రైళ్లను త్వరలో ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.