TGSRTC | తెలంగాణ ఆర్టీసీని ముందుకు నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోంది. ఆర్టీసీలో త్వరలో నియామకాలు ఉంటాయని ఇటీవలే మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ప్రకటించారు. అలాగే కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నారు. అద్దె బస్సుల బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు రాజధాని నగరంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది.
పెద్దపల్లి, ములుగులో కొత్త బస్ డిపోలు
తాజాగా తెలంగాణలో కొత్తగా రెండు ఆర్టీసీ (TGSRTC) బస్ డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత 15 సంవత్పసరాలుగా రాష్ట్రంలో ఒక్క కొత్త బస్సు డిపో కూడా ఏర్పాటు చేయలేదని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీజీఎస్ ఆర్టీసీని ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. కొన్నేళ్లుగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. కొత్తగా ఉద్యోగ నియామకాలు, కొత్త బస్సుల కొనుగోలు, ఆర్టీసీలో సంస్కరణలతో అనేక కార్మిక సంక్షేమం, ప్రజల సౌకర్యం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నట్లు చెప్పారు.
పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన డిపోను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో, ములుగు జిల్లా ఆర్టీసీ డిపోను ఏటూరు నాగారంలో ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం ఈ రెండు ఆర్టీసీ డిపోల ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. రెండు కొత్త డిపోల ద్వారా ఆ ప్రాంత ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణిస్తారని మంత్రి పొన్నం చెప్పారు. అతి త్వరలోనే బస్ డిపోల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. టీజీఎస్ ఆర్టీసీలో 3,035 ఉద్యోగాలు భర్తీ చేస్తామని పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇప్పటికే ప్రకటించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..