
Sitaram Yechury : సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయన ఆర్థిక, సామాజికవేత్తగా, కాలమిస్ట్‌గా ఏచూరికి ఎంతో గుర్తింపు ఉంది. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా 1992 నుంచి కొనసాగుతున్నారు.
సీతారాం ఏచూరి చెన్నై లో 12 ఆగస్టు 1952న జన్మించారు. ఆయన తండ్రి సోమేశ్వర సోమయాజుల ఏచూరి ఏపీ స్టేట్ రోడ్ కార్పొరేషన్‌లో ఇంజినీర్‌గా పని చేసేవారు. తల్లి కల్పకం సైతం ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. దీంతో ఆయన బాల్యం మొత్తం హైదరాబాద్‌లోనే గడిచింది.
హైదరాబాద్ ఆల్ సెయింట్ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్ పూర్తిచేసిన అనంతరం దిల్లీకి వెళ్లారు. అక్కడ ప్రెసిడెంట్ ఎస్టేట్ స్కూల్‌లో చేరారు.
1970లో సీబీఎస్‌సీ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. సెయింట్ స్టీఫెన్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బీఏ చేశారు.
జేఎన్‌యూ నుంచి ఎంఏ పట్టా పొందారు. డిగ్రీ, పీజీ రెండింటిలోనూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 1975లో దేశంలో ఎమెర్జెన్సీ విధించడంతో ఏచూరి అరెస్టయ్యారు. దీంతో జేఎన్‌యూలో పీహెచ్‌డీలో అర్ధంతరంగా ఆగిపోయింది. డాక్టరేట్‌ని పూర్తి చేయలేకపోయారు.
ఎస్‌ఎఫ్‌ఐ నుంచి విద్యార్థి నేతగా ..
1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI)లో సభ్యుడిగా సీతారాం ఏచూరి చేరారు. ఆ తర్వాత సంవత్సరం ఆయన సీపీఎంలో సభ్యుడిగా చేరారు. జేఎన్‌యూ విద్యార్థి నేతగా ఏచూరి మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978లో అఖిల భారత ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత సీపీఎం ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. 1985 లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో, 1988లో కేంద్ర కార్య వర్గంలో, 1999లో పొలిట్ బ్యూరోలో ఏచూరికి అవకాశం లభించింది. 2005లో పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. 2015 మార్చి 3న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో సీతారాం ఏచూరి సవరణలను ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది. ఇది రాజ్యసభ చరిత్రలో ఇలా జరగడం అరుదు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..