Shimla Masjid controversy | అక్రమ మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా సిమ్లాలో హిందూ సంస్థల భారీ నిరసన.. లాఠీచార్జి
Shimla Masjid controversy latest updates : హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో వివాదాస్పద మసీదు వద్ద తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. భారీ సంఖ్యలో నిరసనకారులు గుమిగూడి మసీదు వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వేసిన బారికేడ్లను సైతం బద్దలు కొట్టారు. దీంతో నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ఈ విషయంపై హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ ఒక ప్రకటన జారీ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే రాష్ట్ర శాంతికి విఘాతం కలిగించే పరిస్థితి రాకూడదని అన్నారు. ఈ వ్యవహారంలో న్యాయం చేసేందుకు కోర్టులో ఉందని, అక్రమ నిర్మాణమని తేలితే చట్టపరంగా కూల్చివేస్తామని చెప్పారు.
ఇదిలావుండగా.. ఇది మసీదు వివాదం కాదని, అక్రమ నిర్మాణానికి సంబంధించిన సమస్య అని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మీడియా సలహాదారు నరేష్ చౌహాన్ అన్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని, ఇందుకోసం 144 సెక్షన్‌ను కూడా అమలు చేశామని చెప్పారు. మాల్యానాలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత మసీదు అక్రమ నిర్మాణం అంశం వెలుగులోకి వచ్చింది. అక్రమంగా నిర్మించిన మసీదును కూల్చివేయాలని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనిరుధ్ సింగ్ అసెంబ్లీలో మసీదు నిర్మాణంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంజౌలీ మార్కెట్‌లో మహిళలకు భద్రత లేదని, లవ్ జిహాద్, చోరీ వంటి ఘటనలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. అనుమతి లేకుండా మసీదు ఎలా నిర్మించారని, విద్యుత్, నీటి సరఫరా ఎందుకు నిలిపివేయలేదని ఆయన ప్రశ్నించారు. అయితే హిమాచల్ ప్రదేశ్ మంత్రి అనిరుధ్ సింగ్ వ్యాఖ్యలను ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా విమర్శించారు, కాంగ్రెస్ బిజెపి భాష మాట్లాడుతోందని ఆరోపించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..