
Land acquisition For Elevated Corridor : సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో రెండు ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించేందుకు అవసరమైన భూమిని అధికారికంగా సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణంలో భూసేకరణ అనేది అత్యంత కీలకమైన అంశం. రాష్ట్ర రహదారి 1 (రాజీవ్ రహదారి)పై జింఖానా గ్రౌండ్ నుంచి శామీర్‌పేట సమీపంలోని ఓఆర్‌ఆర్ జంక్షన్ వరకు, జాతీయ రహదారి 44లో ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ వరకు ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్‌లను నిర్మించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
హైదరాబాద్ కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో సమావేశమైన కలెక్టర్ అనుదీప్.. భూ సేకరణకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ‘స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్’ (ఎస్‌ఆర్‌డిపి) కింద సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్‌లను 2027 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఎలివేటెడ్ కారిడార్‌లను నిర్మించడానికి వేగంగా చర్యలు చేపట్టింది.