
6 దశాబ్దాల నాటి అక్రమ నిర్మాణాల కూల్చివేత
Sambhal Anti-encroachment Drive | సంభాల్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈరోజు ఉదయం నుంచి అధికారులు భారీ ఆక్రమణ నిరోధక డ్రైవ్‌ను (Anti-encroachment drive) చేపడుతున్నారు. వివాదాస్పద షాహి జామా మసీదు-శ్రీహరిహర్ మందిర్ ప్రాంతానికి సమీపంలోని శ్మశానవాటిక భూమిపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగించే ప్రక్రియ ఆదివారం కూడా కొనసాగింది.
పేదల భూమిపై మసీదు నిర్మాణం: జిల్లా మేజిస్ట్రేట్
సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ (DM) రాజేంద్ర పెన్సియా ఈ డ్రైవ్ గురించి కీలక వివరాలు వెల్లడించారు. ఆక్రమణకు గురైన భూమి వాస్తవానికి రక్షిత భూమి అని, అది పేదలకు కేటాయించబడిందని ఆయన తెలిపారు. ఈ భూమి వివాదం రెవెన్యూ కోర్టుకు చేరగా, విచారణ అనంతరం 48 మందిని అనధికార నివాసులుగా గుర్తించి నోటీసులు జారీ చేశారు. కాగా నోటీసులు అందుకున్న కొందరు నివాసితులు స్వయంగా తమ నిర్మాణాలను కూల్చివేసుకున్నారని, ప్రస్తుతం అధికారులు ఆ శిథిలాలను తొలగించి, భూమిని అసలైన లబ్ధిదారులకు అప్పగిస్తున్నారని డీఎం వివరించారు.
60 ఏళ్ల నాటి ఆక్రమణలు
అధికారుల అంచనా ప్రకారం, ఈ ఆక్రమణలు దాదాపు 60 నుండి 65 సంవత్సరాల నాటివి. ప్లాట్ నంబర్ 32/2 పరిధిలో సుమారు 4,780 చదరపు మీటర్ల భూమి ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ శాఖ శాస్త్రీయంగా కొలతలు నిర్వహించిన తర్వాతే ఈ చర్యలు చేపట్టారు. కాగా విషయమై తహసీల్దార్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. అక్రమంగా నివసిస్తున్న వారికి తమ వివరణ ఇచ్చుకోవడానికి 15 రోజుల సమయం ఇచ్చామని తెలిపారు.
ప్రాథమిక నివేదికలో 22 ఇళ్లు, దుకాణాలు ఉన్నట్లు తేలినప్పటికీ, క్షేత్రస్థాయిలో విచారణ జరిపితే మరిన్ని కుటుంబాలు అక్కడ నివసిస్తున్నట్లు గుర్తించారు. నివాసితుల వివరణలు సంతృప్తికరంగా లేకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
“స్వయంగా కూల్చివేయండి.. లేదంటే జరిమానా”
సంభాల్ జిల్లాలో ఎక్కడ ఆక్రమణలు ఉన్నా వాటిని వదిలేది లేదని డీఎం రాజేంద్ర పెన్సియా స్పష్టం చేశారు. “ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా నిర్మాణాలను తొలగించుకోవాలి. లేనిపక్షంలో ప్రభుత్వం వాటిని కూల్చివేసి, ఆ ఖర్చును (Demolition cost) కూడా జరిమానా రూపంలో ఆక్రమణదారుల నుండే వసూలు చేస్తుంది” అని ఆయన హెచ్చరించారు.

