
PM Modi on RSS | భారతీయ జనతా పార్టీ (బిజెపి) సైద్ధాంతిక గురువు అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ (ఎన్‌జిఓ) అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) శుక్రవారం అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి ఈ ప్రకటన చేశారు.
“ఈ రోజు, 100 సంవత్సరాల క్రితం, ఒక సంస్థ పుట్టిందని నేను గర్వంగా చెప్పాలనుకుంటున్నాను. అదే.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)” అని ప్రధాని మోదీ అన్నారు. “దేశానికి 100 సంవత్సరాల సేవలు అందించడం గర్వించదగ్గ విషయం. ఇది సువర్ణ అధ్యాయం. ‘వ్యక్తి నిర్మాణమే దేశ నిర్మాణమనే సంకల్పంతో, భారత సంక్షేమం లక్ష్యంతో, స్వయంసేవకులు మన మాతృభూమి సంక్షేమానికి తమ జీవితాలను అంకితం చేశారు… ఒక విధంగా, RSS ప్రపంచంలోనే అతిపెద్ద NGO. దీనికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది” అని ఆయన అన్నారు.
ఆగస్టు 26న ఆర్‌ఎస్‌ఎస్ మెగా వేడుకలు
ఆగస్టు 26 నుంచి, ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మెగా వేడుకలను నిర్వహించాలని యోచిస్తోంది. ‘100 సంవత్సరాల సంఘ యాత్ర – న్యూ హారిజన్స్’ అనే పేరుతో ఈ కార్యక్రమం ఆగస్టు 26 నుండి ఆగస్టు 28 వరకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరుపుకుంటారు. ఈ కార్యక్రమం సంఘం ప్రారంభం నుండి దాని లక్ష్యాలు, భావజాలం, సామాజిక సేవా కార్యక్రమాలను దేశ ప్రజలకు వివరించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది.
‘స్వాతంత్ర్యంపై భారతీయులు సంతృప్తి చెందకూడదు’
అంతకుముందు రోజు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ, దేశస్థులు స్వాతంత్ర్యం పట్ల సంతృప్తి చెందకూడదని, దానిని “సజీవంగా” ఉంచడానికి కష్టపడి పనిచేయాలని, త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భువనేశ్వర్‌లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు.
“మన పూర్వీకులు అత్యున్నత త్యాగాలు చేయడం ద్వారా భారతదేశానికి స్వతంత్రం తెచ్చారు… దేశాన్ని సజీవంగా ఉంచడానికి ఆత్మవిశ్వాసం నింపడానికి, గొడవల్లో మునిగి ఉన్న ప్రపంచానికి మార్గనిర్దేశం చేయడానికి ‘విశ్వ గురువు’ (ప్రపంచ నాయకుడు)గా ఉద్భవించడానికి మనం కూడా అంతే కష్టపడి పనిచేయాలి” అని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.