
కీర్తనగర్ హౌసింగ్‌బోర్డ్ కాలనీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) సంఘ శతాబ్ది కార్యక్రమాల్లో భాగంగా వరంగల్ 16 డివిజన్ కీర్తినగర్ హౌసింగ్‌బోర్డ్‌కాలనీ (కోటిలింగాల బస్తీ) లోని అభయాంజనేయస్వామి ఆలయంలో మంగళవారం సంక్రాంతి ఉత్సవం (Sankranthi Utsavam) ఘనంగా జరిగింది. ఈ ఉత్సవానికి ముఖ్య వక్తగా వరంగల్ మహానగర్ కార్యకారిణి సదస్య్ అల్లోజు వెంకటేశ్వర్లు, ముఖ్యఅతిథిగా కాశిబుగ్గ నగర సహా కార్యవహా దినేష్ తోపాటు పెద్ద సంఖ్యలో స్వయంసేవక్‌లు, కాలనీవాసులు, చిన్నారులు హాజరయ్యారు.
ఈసందర్భంగా అల్లోజు వెంకటేశ్వరు ప్రసంగిస్తూ.. సంక్రాంతి పర్వదినం విశిష్టత, భారతీయ సంస్కృతికి సంబంధించిన విషయాలను విశ్లేషణాత్మకంగా వివరించారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడాన్ని ‘సంక్రమణం’ అంటారని, సూర్యుడు ధనస్సు రాశి నుంచి తన కుమారుడైన శనీశ్వరుడికి అధిపతిగా ఉన్న మకర రాశిలోకి ప్రవేశించే రోజునే మనం ‘మకర సంక్రాంతి’గా జరుపుకుంటామని వివరించారు. . సూర్యుడు, ఉత్తరాయణ పుణ్యకాలం. సంక్రాంతి రోజు నుండే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందని, పురాణాల ప్రకారం, ఉత్తరాయణం దేవతలకు పగలుగా, దక్షిణాయనం రాత్రిగా పరిగణించబడుతుందని తెలిపారు. అందుకే ఈ సమయం ఆధ్యాత్మిక సాధనలకు, శుభకార్యాలకు అత్యంత పవిత్రమైనదని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. హిందూ ధర్మంలో కంటికి కనిపించే దైవం (ప్రత్యక్ష దైవం) సూర్యుడు. ఆయన సమస్త జీవరాశికి శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించే మూలాధారమని అన్నారు. రైతులు తాము పండించిన కొత్త పంటను మొదట సూర్యుడికి నివేదించడం ద్వారా ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అందుకే కొత్త బియ్యంతో ‘పొంగలి’ వండి సూర్య భగవానుడికి నైవేద్యంగా పెడతారు.
“అ, ఆ, ఇ, ఈ” ల వెనుక ఉన్న అర్థం మన మూలాలను గుర్తు చేస్తుంది. అ అంటే అమ్మ.. సృష్టికి మూలం అమ్మే అని నేర్చుకోవడం వల్ల పిల్లల్లో మాతృదేవోభవ అనే సంస్కారం పెరుగుతుంది.
ఆ అంటే ఆవు.. ప్రకృతిని, పశువులను ప్రేమించడం, గోమాతలోని దైవత్వాన్ని గుర్తించడం నేర్పుతుంది.
ఇ అంటే ఇల్లు: కుటుంబం యొక్క ప్రాముఖ్యతను, అనుబంధాలను తెలియజేస్తుంది.
ఈ అంటే ఈశ్వరుడు: సర్వశక్తిమంతుడైన దైవం పట్ల భక్తిని, క్రమశిక్షణను అలవరుస్తుంది.
ప్రస్తుత పరిస్థితిపై చూస్తుంటే ఆవేదన కలుగుతోంది.. ఈరోజు విద్యావ్యవస్థలో “A for Apple, B for Ball” అంటూ కేవలం వస్తువుల పేర్లను నేర్పడం వల్ల పిల్లలు లోక జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు కానీ, ‘జీవన జ్ఞానాన్ని’ కోల్పోతున్నారు. పొద్దున్నే తిను – ఆడు.. అంటే కేవలం భౌతిక అవసరాలకే (ఆహారం, వినోదం) ప్రాధాన్యత ఇస్తున్నాం.
ఫలితంగా తెలివైన విద్యార్థులు తయారవుతున్నారు కానీ, తోటి మనిషిని ప్రేమించే, పెద్దలను గౌరవించే ‘సంస్కారవంతులు’ తక్కువవుతున్నారు. మనం ఏం చేయగలమంటే: పాఠశాలల్లో ఇంగ్లీష్ నేర్చుకున్నా, ఇంట్లో మాత్రం మనం మన పిల్లలకు మన తెలుగు అక్షరాల వెనుక ఉన్న ఈ ‘సంస్కార పాఠాలను’ నేర్పించాలి. అక్షరంతో పాటే ఆత్మీయతను, ధర్మాన్ని కూడా అందించాలి. అని అల్లోజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.

