ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్
కోల్‌కతా/ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా (Murshidabad District) లో బాబ్రీ మసీదు తరహాలో నూతన మసీదును నిర్మించాలనే ప్రతిపాదనపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) ఆదివారం తీవ్రంగా స్పందించారు. ఇది ముస్లింల ప్రయోజనం కోసం చేస్తున్న పని కాదని, కేవలం పాత వివాదాలను మళ్లీ తెరపైకి తెచ్చి ఎన్నికల లబ్ధి పొందేందుకు పన్నిన “రాజకీయ కుట్ర” అని ఆయన అభివర్ణించారు.
ఓట్ల కోసమే వివాదాల పునరుద్ధరణ
పశ్చిమ బెంగాల్‌లో పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భగవత్ మాట్లాడుతూ.. “బాబ్రీ మసీదును పునర్నిర్మించడం ద్వారా ముగిసిపోయిన వివాదాన్ని తిరిగి ప్రారంభించడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కేవలం ఓట్ల కోసమే జరుగుతోంది తప్ప హిందువులకో, ముస్లింలకో దీనివల్ల ఎలాంటి లాభం లేదు. ఇలాంటి చర్యలు సమాజానికి మంచివి కావు” అని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ ధనంతో మతపరమైన నిర్మాణాలు వద్దు
ప్రభుత్వ నిధులతో మతపరమైన కట్టడాలు నిర్మించడంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. “ప్రభుత్వాలు దేవాలయాలను గానీ, మసీదులను గానీ నిర్మించకూడదు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంమంత్రిగా ఉన్నారు, కానీ దానికి ప్రభుత్వ డబ్బును ఉపయోగించలేదు. అలాగే అయోధ్య రామమందిరాన్ని కూడా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రజల సహకారంతో ట్రస్ట్ నిర్మించింది తప్ప ప్రభుత్వం కాదు” అని గుర్తు చేశారు.
వివాదానికి కారణమైన ‘హుమాయున్ కబీర్’ చర్య
కాగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్, బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజైన డిసెంబర్ 6న బెల్దంగాలో ఈ నూతన మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. దాదాపు 40 వేల మందికి షాహి బిర్యానీ పంపిణీ చేయడంతో పాటు భారీ ఎత్తున విరాళాలు సేకరించారు. కబీర్ తెలిపిన వివరాల ప్రకారం.. శంకుస్థాపన రోజే క్యూఆర్ కోడ్ ద్వారా రూ. 2.47 కోట్లు, విరాళాల పెట్టెల ద్వారా రూ. 57 లక్షలు వసూలయ్యాయి.
రాజకీయ దుమారం
ఈ ఘటన బెంగాల్‌లో మతపరమైన ధ్రువీకరణకు దారితీస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారని బీజేపీ విమర్శించగా, హుమాయున్ కబీర్ చర్యలకు, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టీఎంసీ ఇప్పటికే స్పష్టం చేస్తూ ఆయన్ను సస్పెండ్ చేసింది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ బాబ్రీ మసీదు నమూనా నిర్మాణం బెంగాల్ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది.


