West Bengal | జూనియర్ డాక్టర్ రేప్ కేసులో ఆగని నిరసన జ్వాలలు.. 50మంది సీనియర్ వైద్యుల రాజీనామా
Rg Kar Medical College Case | పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో (RG Kar Medical College ) వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్య ఘటనలో షాకింగ్ పరిణామాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ వ్యవహారంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూనియర్ వైద్యులు కొనసాగిస్తున్న నిరాహార దీక్షకు సీనియర్ వైద్యులు, ఫ్యాకల్టీ సభ్యులు సైతం మద్దతు తెలిపారు. మంగళవారం ఉదయం 15 మంది సీనియర్ వైద్యులు జూనియర్ డాక్టర్ల నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఇదిలా ఉండగా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలోని 50 మంది సీనియర్ వైద్యులు, బోధనా సిబ్బంది ఒక్కసారిగా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. వీరు రాజీనామా పత్రంపై సంతకాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.
కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ కళాశాల హాస్పిటల్ లో ఆగస్టు 9న జూనియర్ డాక్టర్ పై కిరాతకంగా అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసిన విషయం తెలిసిందే.. ఈ ఘటనతో వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. బెంగాల్ ముఖ్యమంత్రి సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. తమ డిమాండ్లను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో.. 42 రోజుల పాటు కొనసాగిన నిరసనలు విరమించి గత నెల 21న పాక్షికంగా విధుల్లో చేరారు. ఈ క్రమంలోనే తమ భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా చర్యలు చేపట్టడంలేదని జూడాలు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు ఈ దీక్షలు మంగళవారానికి నాలుగో రోజుకు చేరాయి.
ఆసుపత్రుల్లో పోలీసు రక్షణను పెంచాలని, పర్మినెంట్ మహిళా పోలీసు సిబ్బందిని నియమించాలని, వైద్యులు, నర్సులు, ఇతర అవసరమైన ఆరోగ్య కార్యకర్తలకు ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని జూనియర్ డాక్టర్లు పిలుపునిచ్చారు. కాలేజ్ ఆఫ్ మెడిసిన్, సాగూర్ దత్తా హాస్పిటల్‌లో ఒక రోగి కుటుంబం ఇటీవల వైద్యసిబ్బందిపై దాడి చేసిన విషయాన్ని వారు ప్రస్తావించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..