హైందవ విలువల పునరుద్ధరణకు మహిళలే మార్గదర్శకులు

Spread the love
  • దేశం శక్తివంతంగా ఉండాలంటే సమాజంలో ఐక్యత అవసరం
  • సనాతన ధర్మ పునరుద్ధరణ ప్ర‌తీ ఇంటి నుంచి మొద‌లు కావాలి
  • రాష్ట్ర సేవికా స‌మితి తెలంగాణ ప్రాంత స‌హకార్యవాహిక పాల‌గుమ్మి భాస్క‌ర్ ల‌క్ష్మి

Rashtra Sevika Samiti : వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లా రాష్ట్ర సేవికా స‌మితి (Rashtra Sevika Samiti) విజ‌య‌ద‌శ‌మి ఉత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. వ‌రంగ‌ల్ లోని కె క‌న్వెన్ష‌న్ హాలులో జ‌రిగిన ఈ వేడుక‌ల్లో ముఖ్యఅతిథిగా ప్ర‌ముఖ గైన‌కాల‌జిస్టు డాక్ట‌ర్‌ గుజ్జుల సౌమ్య‌, ముఖ్య వ‌క్త‌గా రాష్ట్ర సేవికా స‌మితి తెలంగాణ ప్రాంత స‌హకార్యవాహిక పాల‌గుమ్మి భాస్క‌ర్ ల‌క్ష్మి హాజ‌రయ్యారు. అలాగే వ‌రంగ‌ల్ జిల్లా కార్య‌వాహిక మ‌ద్దాల అర్చ‌న‌, హ‌న్మ‌కొండ జిల్లా కార్య‌వాహిక స‌ముద్రాల క‌విత, రాష్ట్ర సేవికా స‌మితి ప్రాంత వ్యవస్థా ప్రముఖ్, వరంగల్ విభాగ్ పాలక అధికారి గుదిమెళ్ళ అనంతలక్ష్మి, ప్రాంత కుటుంబప్రబోధన్ గతివిధి ప్రముఖ్, షహమీర్ జ్యోతిర్మయి, వరంగల్ విభాగ్ కార్యవాహిక దిడ్డిగె జ్యోతిర్మయితోపాటు పెద్ద సంఖ్య‌లో సేవిక‌లు, మ‌హిళ‌లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ సౌమ్య మాట్లాడుతూ.. రాష్ట్ర సేవికా స‌మితి చేస్తున్న కార్య‌క్ర‌మాలు అమూల్య‌మైన‌వ‌ని కొనియాడారు. స‌మాజంలో మ‌హిళ‌లు పురుషులతో స‌మానంలో అన్నిరంగాల్లో రాణిస్తున్నార‌ని తెలిపారు. కానీ ఇంకా మ‌హిళ‌ల‌పై వివ‌క్ష కొన‌సాగుతుండ‌డం విచార‌క‌ర‌మ‌ని అన్నారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర సేవికా స‌మితి తెలంగాణ ప్రాంత స‌హకార్యవాహిక పాల‌గుమ్మి భాస్క‌ర్ ల‌క్ష్మి మాట్లాడుతూ.. మన దేశం ప్ర‌పంచ వేదిక‌పై విశ్వ‌గురువుగా నిల‌వాలంటే మన సనాతన ధర్మం అచంచలంగా నిలవాలని పేర్కొన్నారు. ఆదిశంకరాచార్యులు స్థాపించిన నాలుగు పీఠాలు, చత్రపతి శివాజీ మహారాజ్ నుండి సుభాష్ చంద్రబోస్ వరకు హిందూ సంస్కృతి, దేశభక్తి కోసం చేసిన త్యాగాలు ఎన్న‌టికీ మ‌ర‌చిపోలేనివ‌ని గుర్తుచేశారు. “ఈ దేశం సింధు నుంచి హిందూ వరకు ఒకటే ధర్మంతో బంధించబడి ఉంది. ఆ ధర్మరక్షణ మన అందరి బాధ్యత” అని పేర్కొన్నారు. ఆదిశంకరాచార్యులు నాలుగు దిక్కుల పీఠాలను స్థాపించి ధర్మాన్ని స్థిరపరచగా, శివాజీ మహారాజ్ చదువుకి దూరంగా ఉన్న మారాఠా యువకులను శిక్షణ ఇచ్చి హిందూ సామ్రాజ్య స్థాపనకు కృషి చేశార‌ని తెలిపారు. ఇక‌ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర సమరంలో జర్మనీతో మిత్రత్వం చేసి దేశ స్వాతంత్రానికి కొత్త దిశ చూపారని గుర్తుచేశారు.

భార‌త స్వాతంత్ర్యానంత‌రం ఉక్కుమ‌నిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ ప్రాంతాన్ని భాగ్యనగర్‌గా ఏకీకరించడం, దేశంలోని అనేక సంస్థానాల‌ను విలీనం చేయ‌డం ద్వారా భారత ఐక్యతకు బాటలు వేసారని తెలిపారు. “దేశం ధర్మంతో ఏకమై ఉండటం మహనీయులందరి కల” అని చెప్పారు.

1925లో డాక్టర్ కేశవరావ్ బలిరామ్ హెడ్గేవార్ ఆలోచనతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్థాపించబడిందని వివరించారు. “దేశం శక్తివంతంగా ఉండాలంటే సమాజంలో ఐక్యత అవసరం” అని పేర్కొన్నారు. వందేళ్ల RSS ప్రయాణం దేశవ్యాప్తంగా వ్యక్తి, కుటుంబం, సమాజ నిర్మాణానికి మార్గం చూపిందని చెప్పారు. RSS ప్రచారకుల త్యాగాలను, ముఖ్యంగా డాక్టర్ వేదుల సత్యనారాయణమూర్తి, వెంకట సుబ్రహ్మణ్యం వంటి కార్యకర్తల సేవలను గుర్తుచేశారు. “ సంఘ‌ ప్రచారకులు కాషాయ దుస్తులు ధ‌రించ‌ని స‌న్యాసులని, కుటుంబం, పిల్ల‌ల కంటే.. దేశం, స‌నాత‌న ధ‌ర్మమే ప‌ర‌మావ‌ధిగా ప‌నిచేస్తుంటార‌ని కొనియాడారు. వారి త్యాగాల వల్ల‌నే నేటి సమాజం ముందుకు సాగుతోంది” అని చెప్పారు.

మహిళా శక్తి ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, రాష్ట్ర సేవికా సమితి స్థాపకురాలు లక్ష్మీబాయి కేల్కర్ 1936లో రాష్ట్ర సేవికా స‌మితికి శ్రీకారం చుట్టారని, వ‌చ్చే ఏడు 90 వ‌సంతంలోకి అడుగుపెడుతున్నామ‌ని, 2036లో సమితి శతజయంతి వేడుకలు ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. హైందవ ధర్మం, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ సమగ్రత, సామాజిక సమరసత, స్వభాషాభిమానం, పౌర విధుల పరిరక్షణ — ఇవే మన సంస్కృతి మూలాలు అని పాల‌గుమ్మి భాస్క‌ర్ ల‌క్ష్మి తెలిపారు.

రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ ప్ర‌వేశ‌పెట్టిన పంచ‌ప‌రివ‌ర్త‌న్ ను ప్రతీ ఒక్క‌రూ అనుస‌రించాల‌ని పిలుపునిచ్చారు.
“ప్రతీ ఇల్లు ప్లాస్టిక్ రహితం కావాలి, ప్రతీ కుటుంబం పాశ్చాత్య పోక‌డ‌ల‌కు దూరంగా ఉంటూ ఐక్యతతో నిండాలి, సమాజం సమరసతతో సాగాలి” అని పిలుపునిచ్చారు. “భారతమాత రుణం తీర్చుకోవడమే మన జీవిత ధ్యేయం కావాలి” అని పేర్కొన్నారు.

సనాతన ధర్మం – మన బాధ్యత

మన సంస్కృతి, మన సనాతన ధర్మం నిరంతరంగా నిలవాలంటే మనమే కృషి చేయాలి. ఈ ధర్మం మన జీవన విధానం, మన విలువల ప్రతిబింబం. రామాయణం, మహాభారతం, భాగవతం వంటి గ్రంథాల్లోని ఉపదేశాలు మన కుటుంబాల్లో ప్రతిధ్వనించాలని పాల‌గుమ్మి భాస్క‌ర్ ల‌క్ష్మి అన్నారు.

పిల్లలు ఎక్కువ సమయం తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు. కాబట్టి వారికి మొదటి గురువు అమ్మనే. యశోద దేవి శ్రీకృష్ణునికి రామాయణం చెప్పినట్టుగా మనమూ మన పిల్లలకు ధర్మం, నైతికత నేర్పించాలి. పిల్లలకు రాముడు, కృష్ణుడు, సీత, హనుమంతుడు వంటి విలువల ప్రతీకలను పరిచయం చేయాలి. మన కుటుంబాల్లో భగవద్భక్తి, ధర్మనిష్ఠ, సాంస్కృతిక గౌరవం నెలకొనాలి. అమ్మ అంటే శక్తి — విజయదుర్గ, మహాకాళి, పార్వతి రూపాలు. ఇలాంటి స్త్రీ శక్తిని మనం గౌరవించాలి, కాపాడుకోవాలి. స్త్రీ – పురుషులు సమానంగా సత్కరించబడే సమాజం మన లక్ష్యం కావాలన్నారు.

కుటుంబమే సమాజానికి మూలం

మన కుటుంబాలు సుస్థిరంగా ఉంటేనే సమాజం బలంగా ఉంటుంది. నేటి కాలంలో “డబుల్ ఇన్‌కమ్, నో కిడ్స్”, “లివింగ్ టుగెదర్” వంటి కొత్త ధోరణులు పెరుగుతున్నాయి. కానీ మన పూర్వీకులు చూపిన సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ సమాజ నిర్మాణానికి అతి బలమైన పునాది.. మన బాధ్యత కుటుంబ బంధాలను కాపాడటం, పెద్దలకు గౌరవం ఇవ్వడం, పిల్లల్లో విలువలు నాటడం అనేవి సామాజిక బాధ్యతలు అని భాస్క‌ర్‌ల‌క్ష్మి గుర్తుచేశారు.

మన చుట్టుపక్కల ఉన్న వారందరూ మన సోదరులు, సోదరీమణులు. ఎవరూ తక్కువ, ఎవరూ ఎక్కువ కాదు. మన ఇంట్లో పని చేసే వారు, రోడ్లు ఊడ్చే వారు, ఆఫీసుల్లో కూర్చున్న వారు — అందరూ సమాన గౌరవానికి అర్హులు. ఇదే “డిగ్నిటీ ఆఫ్ లేబర్” అనే భావం. సామాజిక సమరసత అంటే కేవలం సహనం కాదు, పరస్పర గౌరవం. మనం దానిని మన ప్రవర్తనలో చూపించాల‌న్నారు. .

పర్యావరణ పరిరక్షణ
ప్రకృతిని కాపాడడం మన ధర్మం. ప్లాస్టిక్ రహిత ఇల్లు, పరిశుభ్రమైన పరిసరాలు, నీరు – గాలి – భూమి – అగ్ని – ఆకాశం పంచభూతాల పట్ల గౌరవం — ఇవన్నీ మనం పాటించాలి. మన ఇల్లు, మన వీధి, మన ఊరు — అన్నీ పవిత్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. “ప్రకృతిలో దొరికే వాటిని వృథా చేయొద్దు” — ఇది మన కొత్త ప్రతిజ్ఞ కావాలి.

మన భాష, మన సంస్కృతి — ఇవే మన ఆత్మ. తెలుగు మాట్లాడడం, తెలుగు చదవడం, మన సంస్కృతిని పిల్లలకు పరిచయం చేయడం మన బాధ్యత. స్వభాషను మరిచి పరభాషను మోజు పడటం కాదు, రెండు నేర్చుకోవడం మంచిది కానీ మన మూలాలు మర్చిపోవద్దు అని భాస్క‌ర‌ల‌క్ష్మి పేర్కొన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

More From Author

Zoho Mail features

Gmailకు ప్రత్యామ్నాయం కావాలా? Zoho Mail అందించే అద్భుతమైన ఫీచర్లు తెలుసుకోండి!

Mamata Banerjee

Durgapur | ‘అమ్మాయిలు రాత్రిపూట కళాశాల బయటకు వెళ్లొద్దు.. దుర్గాపూర్ గ్యాంగ్ రేప్ కేసుపై సీఎం మమతా బెనర్జీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *