
స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్
వరంగల్ : మార్చి 2024 నుండి రిటైరైన పెన్షనర్లందరికీ పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం అసోసియేషన్ వరంగల్ జిల్లా యూనిట్ అధ్యక్షుడు తుమ్మ వీరయ్య అధ్యక్షతన జిల్లా బాధ్యులు సమావేశం వరంగల్‌లో జరిగింది. ఈ సమావేశంలో 2026 సంవత్సర యొక్క డైరీ కి సంబంధించిన విషయాలపై చర్చించారు.
ఈ సందర్భంగా తుమ్మ వీరయ్య మాట్లాడుతూ.. మార్చి 2024 నుంచి రిటైరైన పెన్షనర్లందరికీ పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ల ముందు ఈనెల 27న నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మార్చి 2024 నుంచి రిటైరైన పెన్షనర్లకు 18 నెలలు గడిచినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించక పోవడంతో ఆర్థిక కష్టాలతో కుంగిపోయి సుమారు 24 మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా అనేక మంది హాస్పిటల్ పాలు కావటం, పిల్లల వివాహాలు చేయకపోవటం వంటి సంఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తక్షణమే పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లింపులు జరపాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునిగంటి సాంబయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.సుధీర్, అసోసియేట్ ప్రెసిడెంట్ పి.పరమేశ్వర్, ఆర్థిక కార్యదర్శి నిమ్మకాయ సదానందంతోపాటు సభ్యులు, పాల్గొన్నారు.

