Operation Black Giraffe: గూండాయిజాన్ని మట్టి కరిపించేందుకు మరో ప్లాన్
Operation Black Giraffe : యూపీలో గుండా మట్టి కరిపించేందుకు యూపీ ప్రభుత్వం మరో కొత్త ప్లాన్ ను అమలు చేస్తుంది.
ప్రయాగ్ రాజ్ జిల్లాలో మాఫియా, గ్యాంగ్‌స్టర్లు, హిస్టరీ షీటర్‌ల ఆస్తులను గుర్తించి, అటాచ్ చేయడానికి ప్రయాగ్‌రాజ్ పోలీసులు ఆపరేషన్ బ్లాక్ జిరాఫీని ప్రారంభించారు. గ్యాంగ్స్టర్ల ఆర్థిక బలాన్ని బలహీనపరచడం.. వ్యవస్థీకృత నేరాలను నియంత్రించడం ఈ ఆపరేషన్ లక్ష్యం.
ఈ ఆపరేషన్ లో భాగంగా పోలీసులు మాఫియాల చర, స్థిరాస్తులను దర్యాప్తు చేసి వాటిని అటాచ్ చేయడానికి స్పెషల్
డ్రైవ్‌ను ప్రారంభించారు. మాఫియాల ప్రభావాన్ని నిర్జీవం చేయడం.. వారి అక్రమ ఆదాయ ప్రవాహాన్ని ఆపడం ద్వారా వారిని ఆర్థికంగా బలహీనపరచడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది.
మాఫియాలకు చెందిన ఆస్తులు, బినామీ ఆస్తులను గుర్తించి, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు పోలీసులు వాటిని అటాచ్ చేస్తారని అధికారులు తెలిపారు. భూ మాఫియాలపై ప్రత్యేక దృష్టి సారించామని అధికారులు తెలిపారు. ఆపరేషన్ బ్లాక్ జిరాఫీ కింద తీసుకున్న చర్యలు డిసిపిల నేతృత్వంలోని పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు.
అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ మరణం తరువాత, అతని ప్రత్యర్థులు, మాజీ ముఠా సభ్యులు చాలా మంది వారి భూములను లాక్కోవడం ప్రారంభించారు.. అంతటితో ఆగకుండా కొందరు భూ మాఫియా బాస్ లు ప్రభుత్వ భూములు, ప్రైవేట్ ఆస్తులను లాక్కునే పనిలో పడ్డారు.
ఆపరేషన్ బ్లాక్ జిరాఫీ కింద అటువంటి వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా, యాక్టివ్ గా ఉన్న నేరస్థులు, గ్యాంగ్‌స్టర్లు, హిస్టరీ షీటర్లను కూడా పోలీసులు గుర్తించి వారిపై నివారణ చర్యలు తీసుకుంటారు.
ఇప్పటికే ఆపరేషన్ బ్లాక్ జిరాఫీని ప్రారంభించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అతిక్‌కు చెందిన కొన్ని బినామీ ఆస్తులను గుర్తించగా, ఝూన్సీకి చెందిన మాఫియా గణేష్ యాదవ్‌ను అరెస్టు చేశారు.
ఆపరేషన్‌లో భాగంగా, షాహ్‌గంజ్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో అతిక్ యాజమాన్యం, అతని భార్య షైస్తా పర్వీన్ పేరు మీద మిన్హాజ్‌పూర్ ప్రాంతంలో ఒక స్థలాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఆస్తులను త్వరలో అటాచ్ చేయనున్నారు..
జిరాఫీ పేరు ఎందుకంటే..?
జిరాఫీ పొడవాటి మెడను కలిగి ఉంటుంది. దాని మెడతో తన పరిసరాలను సులువుగా గమనించగలదు.. దీని స్ఫూర్తితోనే ఈ ఆపరేషన్‌కు బ్లాక్ జిరాఫీ (Operation Black Giraffe) పేరు పెట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. నల్లధనం, అక్రమ ఆస్తులపై నిఘా ఉంచేందుకు పోలీసులు కూడా జిరాఫీలా వ్యవహరిస్తారు.
అతిక్ మరియు ఇతర మాఫియాలకు చెందిన అనేక ఆస్తులను ఇప్పటికే అటాచ్ చేసినట్లు ప్రయాగ్‌రాజ్ పోలీస్ కమిషనర్ రమిత్ శర్మ తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.