
BMC Elections 2026 | ముంబై: దేశంలోనే అత్యంత సుసంపన్నమైన మున్సిపల్ కార్పొరేషన్ అయిన బీఎంసీ (BMC) పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార ‘మహాయుతి’ కూటమి వ్యూహాలకు పదును పెట్టింది. సీట్ల పంపకాలపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య ఒప్పందం ఖరారైంది.
సీట్ల పంపకాలు ఇలా..
- మహాయుతి వర్గాల ప్రకారం, మొత్తం 227 సీట్లలో:
- భారతీయ జనతా పార్టీ (BJP): 140 స్థానాల్లో పోటీ చేయనుంది.
శివసేన (షిండే వర్గం): 87 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. ఇప్పటికే 200 సీట్లపై స్పష్టత రాగా, మిగిలిన స్థానాలపై తుది చర్చలు జరుగుతున్నాయి. అసంతృప్తి వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలుగజేసుకుని, కూటమి ధర్మాన్ని పాటించాలని, మిత్రపక్షంపై విమర్శలు చేయవద్దని బీజేపీ నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
ఎన్నికల షెడ్యూల్:
పోలింగ్ తేదీ: జనవరి 15, 2026.
ఫలితాల వెల్లడి: జనవరి 16, 2026. బీఎంసీతో పాటు రాష్ట్రంలోని మరో 28 మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా అదే రోజున ఎన్నికలు జరగనున్నాయి.
మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో ‘మహాయుతి’ క్లీన్ స్వీప్:
ఇటీవల రెండు దశల్లో (డిసెంబర్ 2, 20) జరిగిన మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయతీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించింది. ఈ ఫలితాలు బీఎంసీ ఎన్నికల ముందు కూటమిలో నూతనోత్సాహాన్ని నింపాయి.
మహాయుతి విజయం: మొత్తం 288 మున్సిపల్ అధ్యక్ష పదవుల్లో 207 స్థానాలను కైవసం చేసుకుంది.
- పార్టీల వారీగా:
- బీజేపీ 117,
- శివసేన (షిండే) 53,
- ఎన్సీపీ (అజిత్ పవార్) 37
విపక్షాల పరిస్థితి:
కాంగ్రెస్ కేవలం 28 స్థానాలకే పరిమితం కాగా, ఉద్ధవ్ థాకరే సేన (UBT) 9, శరద్ పవార్ ఎన్సీపీ 7 స్థానాలను మాత్రమే దక్కించుకున్నాయి. మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలనే బీఎంసీలోనూ పునరావృతం చేస్తామని దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, విడిపోయిన ఠాక్రే సోదరులు (ఉద్ధవ్, రాజ్) చేతులు కలపడం ముంబై రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి.

