Subsidy Gas Cylinder : సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ఎన్ని ఇస్తారో తెలుసా.. ?
Mahalaxmi Scheme Subsidy Gas Cylinder : తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇటీవలే రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఇప్పటికే అర్హుల జాబితాను కూడా రూపొందించింది. ఏడాదికి ఎవరికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేసింది. రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులైన వారి మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఏడాదికి ఇవ్వాల్సిన గరిష్ట సిలిండర్ల సంఖ్య ఎనిమిదిగా నిర్ధారించింది.
అయితే ఈ పథకానికి మొదట 39.78 లక్షల మందిని అర్హులుగా తేల్చగా.. తర్వాత ఆ సంఖ్య 39.50 లక్షలకు తగ్గింది. ఇది మరింత తగ్గవచ్చని సమాచారం. అర్హులైన వారిలో దాదాపు 9.10 లక్షల మంది అత్యధికంగా ఏటా 8 గ్యాస్ సిలిండర్లు చొప్పున వినియోగిస్తారని అధికారులు గుర్తించారు. దీంతో ఈ పథకం కింద సబ్సిడీపై ఇవ్వబోయే సిలిండర్ల సంఖ్య ఏడాదికి ఎనిమిదిగా తేల్చారు.
ప్రభుత్వంపై రూ.855.2 కోట్ల భారం
Subsidy Gas Cylinder పథకం వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.71.27 కోట్లు, సంవత్సరానికి రూ.855.2 కోట్ల భారం పడనున్నట్లు ప్రభుత్వం లెక్కగట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ’మహాలక్ష్మి’ పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి ఈ నెల 27న జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఉజ్వల కనెక్షన్ వినియోగదారులకు రూ.38.57 కోట్లు, సాధారణ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి రూ.816.65 కోట్లు అవుతుందని అంచనా వేశారు. రాష్ట్రంలో 11.58 లక్షల మంది ఉజ్వల గ్యాస్ కనెక్షన్ దారులు ఉన్నా.. సబ్సిడీ సిలిండర్ కోసం 5.89 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ పై కేంద్రం ప్రతి సిలిండర్ కు రూ.340 సబ్సిడి ఇస్తుండటంతో వీటిపై రాష్ట్ర ప్రభుత్వం రూ.155 చొప్పున రాయితీ ఇస్తే సరిపోతుంది. కాగా, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మూడేళ్ల గ్యాస్ వాడకం లెక్కలు తీయగా.. కొందరు అతి తక్కువ గ్యాస్ వినియోగిస్తుంటే మరికొందరు అసలు గ్యాస్ వాడడం లేదని తేలింది. గత మూడేళ్లలో సిలిండర్ ను ఒక్కసారి కూడా తీసుకోని వారి సంఖ్య 1,10,706 గా ఉంది. వీరిలో సాధారణ కనెక్షన్ దారులు 92,633 మంది కాగా, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉన్న వారు 18,073 మంది ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సాధారణ ప్రజలతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారిని కూడా మహాలక్ష్మి పథకం కిందకు తీసుకొస్తున్నారు. అయితే, పథకం లబ్దిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సిందేనని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఆ తర్వాత రూ.500 అదనంగా చెల్లించిన ధరను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రీయింబర్స్ మెంట్ చేయనున్నట్లు సమాచారం. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.40 రాయితీని కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. హైదరాబాద్ లో సిలిండర్ ధర రూ.955 ఉంటే.. వినియోగదారుడు చెల్లించాల్సిన రూ.500, కేంద్ర రాయితీ రూ.40 పోను మిగతా రూ.415ని రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుందని తెలుస్తోంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..