215 మంది అధికారులను జైలుకు పంపండి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు..
తమిళనాడులోని ధర్మపురి జిల్లా వాచాతి అనే గిరిజన గ్రామంలో జరిగిన నాటి ప్రభుత్వ అధికారుల దురాగతానికి సంభందించిన కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
1992లో స్మగ్లింగ్ కోసం జరిపిన దాడిలో లైంగిక వేధింపులతో సహా దురాగతాలకు పాల్పడిన 215 మంది అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులందరూ దోషులుగా మద్రాస్ హైకోర్టు నిర్ధారించింది. ఈమేరకు శుక్రవారం అన్ని అప్పీళ్లను కొట్టివేసి గతంలో సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
“బాధితులు, ప్రాసిక్యూషన్ సాక్షులందరి సాక్ష్యాలు సమర్ధవంతంగా, స్థిరంగా ఉన్నాయని ఈ కోర్టు కనుగొంది, అవి నమ్మదగినవి” అని ప్రాసిక్యూషన్ తన సాక్ష్యం ద్వారా తన కేసును రుజువు చేసిందని జస్టిస్ పి వెల్మురుగన్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు.
జూన్ 20, 1992న, అధికారులు స్మగ్లింగ్ గంధపు చెక్కల కోసం వాచాతి గ్రామం పై దాడి చేశారు. ఈ దాడిలో, ఆస్తి, పశువుల విధ్వంసం చేయడమే కాకుండా 18 మంది మహిళలపై అత్యాచారం చేసారు.
ఈ ఘటనపై 2011లో ధర్మపురిలోని సెషన్స్ కోర్టు ఈ కేసుకు సంబంధించి నలుగురు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులు, 84 మంది పోలీసులు, ఐదుగురు రెవెన్యూ శాఖ అధికారులతో సహా 126 మంది అటవీ సిబ్బందిని దోషులుగా నిర్ధారించింది. 269 మంది నిందితులలో, 54 మంది విచారణ సమయంలో మరణించారు. మిగిలిన 215 మందికి 1 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడింది. అయితే..దీన్ని సవాల్ చేస్తూ వీరంతా హైకోర్టు ను ఆశ్రయించారు. ఈ వాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు.. అన్ని అప్పీళ్లను కొట్టేయడంతో పాటు సెషన్స్ కోర్టు తీర్పును సమర్ధించింది..
ఈ తీర్పును సమర్థిస్తూ, మిగిలిన శిక్షా కాలాన్ని అనుభవించడానికి నిందితులందరినీ వెంటనే కస్టడీకి ఇవ్వాలని సెషన్స్ కోర్టును హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.
2016లో డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకు అత్యాచార బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం వెంటనే విడుదల చేయాలని, నేరానికి పాల్పడిన పురుషుల నుంచి 50% మొత్తాన్ని వసూలు చేయాలని జస్టిస్ వేల్మురుగన్ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు.
మారోవైపు నిందితులను రక్షించినందుకు అప్పటి జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు జిల్లా అటవీ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు రాష్ట్రాన్ని ఆదేశించింది.