ఇస్రో కౌంట్‌డౌన్‌ల సమయంలో స్వరం వినిపించిన మహిళా శాస్త్రవేత్త ఇకలేరు..
గుండెపోటుతో ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి కన్నుమూత
చెన్నై : శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాలకు సంబంధించి కౌంట్‌డౌన్‌ల సమయంలో తన స్వరం వినిపించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త వలర్మతి (Valarmathi) ఇకలేరు. శనివారం ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. చంద్రయాన్-3 ప్రయోగ సమయంలో ఆమె చివరిసారిగా బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇచ్చారు.
జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-3ని ప్రయోగించారు.
తమిళనాడులోని అరియలూర్‌కు చెందిన వలర్మతి శనివారం సాయంత్రం గుండెపోటుతో చెన్నైలో మరణించారు. జూలై 14న ప్రయోగించిన అత్యంత విజయవంతమైన చంద్రయాన్-3 ఆమె చివరి కౌంట్‌డౌన్‌గా నిలిచింది. .
ISRO scientist Valarmathi మృతికి ISRO మాజీ డైరెక్టర్ డాక్టర్ PV వెంకటకృష్ణన్ X (ట్విట్టర్) వేదికగా సంతాపం తెలిపారు. “శ్రీహరికోట నుండి ఇస్రో యొక్క భవిష్యత్తు మిషన్ల కౌంట్‌డౌన్‌లకు వలర్మతి మేడమ్ వాయిస్ ఉండదు. చంద్రయాన్-3 ఆమె చివరి కౌంట్‌డౌన్ ప్రకటన. ఊహించని మరణం. చాలా బాధగా అనిపిస్తుంది. అని పేర్కొన్నారు.
ఎన్.వలర్మతి ఎవరు?
1959 జూలై 31న జన్మించిన వలర్మతి 1984లో ఇస్రోలో చేరి అనేక మిషన్లలో పాల్గొన్నారు. ఆమె RISAT-1 యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇది దేశీయంగా అభివృద్ధి చేయబడిన మొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం (RIS). అలాగే మన దేశానికి చెందిన రెండవ ఉపగ్రహం. ఏప్రిల్ 2012లో RISAT-1ని విజయవంతంగా ప్రయోగించారు.
అలాగే, 2015లో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో ‘మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’.. మాజీ రాష్ట్రపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాం జ్ఞాపకార్థం తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక అబ్దుల్ కలామ్ అవార్డును వలర్మతి అందుకున్నారు.