Metro line in Old City: పాతబస్తీ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో రైలు.. కొత్త స్టేషన్లు ఎక్కడెక్కడంటే..
New Metro line in Old City | పాతబస్తీ వాసుల చిరకాల స్వప్నం నెరవేరేందుకు అడుగులు పడ్డాయి. ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి మార్చి 7వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 5.5 కిలోమీటర్ల మార్గంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నూమా వరకు ఈ మెట్రో లైన్ నిర్మించనున్నారు. దీనికి సుమారు రూ.2 వేల కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. పాతబస్తీకి మెట్రో రైలు చిరకాల స్వప్నం. ఎన్నో కారణాల వల్ల ఇన్ని సంవత్సరాలుగా అక్కడ మెట్రో నిర్మాణం సాధ్యం కాలేదు. ఎన్నికలకు ముందే మెట్రో విస్తరణపై బీఆర్ఎస్ ప్రభుత్వం పలు ప్రణాళికలను రూపొందించింది. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టుకు లైన్ నిర్మించాని భావించింది. దీంతో పాతబస్తీలో ప్లాన్లు పెండింగ్ లో పడిపోయాయి. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక పాతబస్తీ మెట్రో ప్రణాళిక లో కదలిక వచ్చింది.
మెట్రోలైన్ నిర్మాణంపై రేవంత్ రెడ్డి.. మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తోపాటు పాతబస్తీ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలతో చర్చించారు. అన్ని చర్చలు పూర్తయిన తర్వాత హైదరాబాద్ (Hyderabad) లోని పాతబస్తీ మెట్రో రైలు (Metro Train) నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. 2012 సంవత్సరంలోనే జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఫలక్‌నూమా వరకు పాతబస్తీ మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు వేశారు . కానీ పలు కారణాలతో ఈ నిర్మాణాన్ని ఎంజీబీఎస్ వరకే నిలిపివేశారు. పాతబస్తీలో రోడ్డు విస్తరణ చేపట్టడం కోసం పలు నిర్మాణాల కూల్చివేయాల్సి రావడంతో పనుల్లో చాలా జాప్యం జరిగింది. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కూడా మెట్రో (L&T Metro) నిర్మాణంపై నిర్లక్ష్యం చేసింది. ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక పాతబస్తీ మెట్రోపై దృష్టి సారించింది. వెంటనే ఈ నిర్మాణం కోసం బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించింది. మెట్రో లైన్ పనులకు శంకుస్థాపన తేదీ కూడా ఖరారు కావడంతో పాతబస్తీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడెక్కడ స్టేషన్లు..?
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అక్కడి నుంచి షిఫా జంక్షన్, పురానీ హవేలీ, ఇత్తెబార్ చౌక్, అలీజా కోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరిబౌళి, శాలిబండా, షంషీర్‌గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గంలో 5 స్టేషన్లను నిర్మించనున్నారు. ఎంజీబీఎస్ స్టేషన్ దాటిన తర్వాత సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్‌గంజ్, ఫలక్‌నుమా స్టేషన్లు ఉండనున్నాయి.
రేవంత్ సర్కారు హైదరాబాద్ మెట్రోను పలు మార్గాల్లో విస్తరించనుంది. మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు.. అలాగే ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకూ మెట్రో లైన్ ను నిర్మించడానికి నిర్ణయించారు. వీటికి సంబంధించిన భూమి నాణ్యత పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..