Hydra News : హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి (హైడ్రా) ను మరింత పవర్‌ఫుల్‌గా మార్చేందుకు వీలుగా బల్దియా చట్టంలో కొత్త సెక్షన్ చేర్చుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ అయింది. దీనికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించి శనివారం రాజ్‌భవన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ కోసం కబ్జాదారులకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టడం, అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం వంటి అధికారాలతో ప్రభుత్వం నూతన సెక్షన్‌ను రూపొందించింది. దానిని జీహెచ్‌ఎంసీ చట్టంలో చేర్చి, తద్వారా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సమకూరే అధికారాలను హైడ్రాకు కూడా బదలి చేయాలని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలకు మరింత సమయం ఉండటంతో.. ఆ నిర్ణయాన్ని తక్షణం అమల్లోకి తెచ్చేందుకు ఆర్డినెన్స్ జారీ చేయాలని .. గవర్నర్ కు ప్రతిపాదనలను పంపించగా వీటిని పరిశీలించిన గవర్నర్ ఆమోదించారు. ఆరు నెలలపాటు ఆర్డినెన్స్ అమలులో ఉంటుందని, దీనిపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సర్కారు ఈ చట్ట సవరణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంటుందని సమాచారం.
హైడ్రాకు నేరుగా అధికారాలు
కాగా జూలై 19న జీవో 99 ద్వారా హైడ్రాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఓఆర్‌ఆర్ వరకు ఉన్న నగరానికి విపత్తుల సమయంలో సాయం అందించేందుకు గానూ ట్రాఫిక్ సమస్యలకు పరిష్కరించేందుకు చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ భూములను కబ్జా నుంచి రక్షించేందుకు ఈ హైడ్రాను ఏర్పాటు చేసింది. దీనికి కమిషనర్‌గా ఐజీ ర్యాంకు అధికారి ఏవీ రంగనాథ్‌ను నియమించింది. అప్పట్నుంచి హైడ్రా చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు అనేక అక్రమ కట్టడాలను తొలగించింది. అయితే ఈ కూల్చివేతల విషయంలో చట్టపరమైన సమస్యల కారణంగా కమిషనర్ రంగనాథ్ ఇతర శాఖలపై ఆధారపడాల్సి వస్తోంది. ఆక్రమణలను తొలగించేందుకు.. జీహెచ్‌ఎంసీ, నగర శివారులోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల ద్వారా నోటీసులు జారీ చేయిస్తూ అనుమతులను రద్దు చేయిస్తూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు 374-బి సెక్షన్‌లోని అధికారాలను హైడ్రాకు బదలాయిస్తే జీహెచ్‌ఎంసీ పరిధిలో హైడ్రా కమిషనర్‌కు నేరుగా ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది.
జీహెచ్‌ఎంసీ చట్టం-1955లో ఇప్పటివరకు 374, 374-ఎ సెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు సెక్షన్ 374-బి చేర్చుతూ ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరించింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సమకూరే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ ఇతర సంస్థకైనా అప్పగించవచ్చని ఆర్డినెన్స్ వెల్లడిస్తోంది. అంటే.. ఆ అధికారాలను త్వరలో హైడ్రాకు బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయనుందని తెలుస్తోంది. తద్వారా హైడ్రాకు ఎక్స్రా పవర్స్ వస్తాయని అధికారులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..