Cognizant | తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో కాగ్నిజెంట్ భారీ విస్తరణ
న్యూ జెర్సీ (అమెరికా) : ఐటి రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కాగ్నిజెంట్ (Cognizant)కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించేలా కొత్తగా మరో సెంటర్ నెలకొల్పనున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతో ఐటీ నిపుణులు, నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 20 వేల మంది ఉద్యోగులు ఉండేలా 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్ ను నిర్మించనున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు.. సోమవారం కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా కాగ్నిజెంట్ సంస్థలో తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో హైదరాబాద్.. తెలంగాణ రాష్ట్రం ఉపాధి, ఉద్యోగ, వ్యాపార రంగాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇప్పుటికే అనేక కొత్త సంస్థలు, ఐటీ కంపెనీల రాకతో ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇందులో భాగంగానే మరో 15,000 మందికి ఉపాధి కల్పించేందుకు కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ను హైదరాబాద్ లో ప్రారంభిచడానికి సిద్ధమవుతుంది. కాగా గత ఏడాది సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన సమయంలోనే ఈ ఒప్పందానికి పునాదులు పడినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం.. కంపెనీ సీఈవో రవికుమార్, ప్రతినిధుల బృందంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
కాగా హైదరాబాద్ లో నెలకొల్పనున్న కొత్త సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయిట్లకు మెరుగైన సేవలందించేందుకు ఉపయోగపడుతుందని కంపెనీ సీఈవో రవికుమార్ అన్నారు. ఐటీ సేవలతో పాటుగా కన్సల్టింగ్ లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని వివరించారు.
Cognizant కంపెనీకి భరోసా..
ఐటీ రంగానికి మరింత అనువైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్ ను తమ గమ్యస్థానంగా ఎంచుకుంటాయని తెలిపారు. కాగ్నిజెంట్ కంపెనీకి తమ ప్రభుత్వం తగినంత మద్దతు ఇస్తుందని తెలిపారు. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరికొన్ని నగరాలకు ఐటీ విస్తరణ
హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర టైర్-2 నగరాలలో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనకు కంపెనీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, ఇక్కడ కొత్త కేంద్రాన్నిస్థాపించాలనే కాగ్నిజెంట్ నిర్ణయం హై దరాబాద్ ప్రగతికి దోహదపడుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..