
Gouri Shankar temple : జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లోని రియాసి జిల్లాలో హిందూ ఆలయం కోసం ఇద్దరు ముస్లింలు తమ భూమిని విరాళంగా ఇచ్చి మత సామరస్యాన్ని చాటుకున్నారు. రియాసి జిల్లా (Reasi district) కాన్సి పట్టా గ్రామంలో 500 సంవత్సరాల నాటి పురాతన హిందూ దేవాలయం కోసం తమ భూమిని విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆ భూమిలో గౌరీ శంకర్ ఆలయాన్ని కలుపుతూ రోడ్డు నిర్మించనున్నారు. ఖేరల్ పంచాయతీకి చెందిన గులాం రసూల్, గులాం మహ్మద్ తమ నాలుగు కెనాల్ స్థలాన్ని పంచాయితీకి విరాళంగా ఇచ్చారు. దీని విలువ సుమారు కోటి రూపాయల అంచనా. కాగా ఈ స్థలంలో ఆలయం కోసం 1200 మీటర్ల రహదారిని 10 అడుగుల వెడల్పుతో నిర్మించనున్నారు.
పంచాయతీ నిధులతో త్వరలో రోడ్డు నిర్మిస్తామని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో టెంపుల్ రోడ్ నిర్మించడానికి ముస్లింలు భూమిని విరాళంగా ఇచ్చారని తెలిపారు. మాజీ పంచాయతీ సభ్యుడు, రైతు గులాం రసూల్ మాట్లాడుతూ రోడ్డు సమస్యను సాకుగా చూపి సమాజంలో చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నించారన్నారు. “ఆలయానికి సరైన రహదారి లేదు. కొందరు వ్యక్తులు చీలికను సృష్టించాలనే ఉద్దేశ్యంతో విద్వేష ప్రచారాన్ని కూడా నడిపారు” అని ఆయన అన్నారు.
మతసామరస్యాన్ని కాపాడేందుకు ఇటీవల పంచాయతీ సభ్యులు, రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భూ యజమానులు గులాం రసూల్, గులాం మహ్మద్ తమ భూమిలో కొంత భాగాన్ని రోడ్డు కోసం ఇచ్చేందుకు అంగీకరించారు. మరోవైపు ఆలయం (Gouri Shankar temple) కూడా పునరుద్ధరణకు సిద్ధమైంది. ఈ ప్రాంతంలో ఆలయానికి మరికొంత భూమి ఉంది. ఈ భూమికి సంబంధించిన విషయాన్ని జిల్లా డెవలప్‌మెంట్ కమిషనర్ రీసీ దృష్టికి తీసుకెళ్లారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..