హైదరాబాద్ : గణేష్ చతుర్థి సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్‌లో పండుగ సందడి తార స్థాయికి చేరుకుంది. చిన్న మట్టి విగ్రహాల ( Clay Ganesha) నుంచి.. భారీ విగ్రహాల వరకు రోడ్లపై కనువిందు చేస్తున్నాయి. వర్షం కురుస్తున్నా కూడా గణేశ విగ్రహాలను డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపులతో మండపాల వద్దకు తరలిస్తున్నారు.
ఖైరతాబాద్ లో 70 అడుగుల భారీ విగ్రహం..
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో 70 ఏళ్ల పండుగ సంప్రదాయానికి గుర్తుగా 70 అడుగుల ఎత్తులో ఆకట్టుకునేలా చరిత్రలోనే అత్యంత ఎత్తైన వినాయక విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక మార్కెట్లలో కూడా గణపతి విగ్రమాల క్రయ విక్రయాలతో సందడి నెలకొంది. అయితే పెరుగుతున్న పర్యావరణ అవగాహనకు ప్రతిస్పందనగా, అనేక మంది మట్టి, సహజ రంగులతో తయారు చేసిన చిన్న గణేష్ విగ్రహాలను కొనుగోలు చేస్తుండడం కనిపిస్తోంది. మట్టి విగ్రహాలు విక్రయించే స్టాళ్ల వద్ద జనం కిక్కిరిసిపోతున్నారు. స్థిరమైన ప్రత్యామ్నాయాల కోసం డిమాండ్‌ను పెంచుతున్నారు, ఆవు పేడతో చేసిన విగ్రహాలకు కూడా ఆదరణ లభిస్తోంది.
నిమజ్జన ప్రక్రియలో నీటి కాలుష్యాన్ని నివారించడానికి కొంతమంది పెద్ద సైజులో ఉన్న మట్టి విగ్రహాలను ఎంచుకుంటున్నారు. అనేక పండళ్ల నిర్వాహకులు మట్టి విగ్రహాలకు ఓటేస్తున్నారు.
హైదరాబాద్ లో 3.10 లక్షల విగ్రహాల పంపిణీ
పర్యావరణ అనుకూల విగ్రహాల (Clay Ganesha Idols) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) 3.10 లక్షల మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేస్తోంది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ కూడా నగరవ్యాప్తంగా ఒక్కొక్కటి లక్ష మట్టి విగ్రహాలను అందజేస్తున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..