చంద్రయాన్–3 సక్సెస్.. జాబిలమ్మపై సేఫ్‌గా ల్యాండ్ అయిన విక్రమ్
Chandrayaan-3 Live : అంతరిక్షంపై ఇండియా సంచలనం సృష్టించింది. దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చంద్రయాన్ 3 చంద్రుడిపై సురక్షితంగా దిగింది. ఒక్కో దశ దాటుకుంటూ ల్యాండర్ విక్రమ్ చందమామను చేరుకుంటుంటే బెంగళూరు ఇస్రో కేంద్రంలో చప్పట్లు, కేరింతలు మారుమోగుతున్నాయి. అది చూసిన జనాల మోముల్లోనూ అమితానందం వెల్లివిరిసింది. చంద్రయాన్3 సేఫ్‌గా ల్యాండింగ్ కావడంతో అందరూ హమ్మయ్య.. అంటూ ఊపిరిపీల్చుకున్నారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చం ద్రయాన్ -3 ప్రాజెక్టు దిగ్విజయమైంది. ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషికి తగ్గ ఫలితం లభించింది. జాబిలి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండ్ అయ్యింది.
విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ నిర్ణీత సమయానికి చంద్రుడిని చేరుకుంది. సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో శాస్త్రవేత్తలు టెన్షన్ కు గురయ్యారు. ల్యాండింగ్ మాడ్యూల్ ను తనిఖీ చేశారు. నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశంలో దిగడానికి సూర్యోదయం కోసం వేచి ఉన్నారు. సూర్యుడి వెలుతురు రాగానే ‘సాఫ్ట్ ల్యాండింగ్’ ప్రక్రియను ప్రారంభించారు. బుధవారం సాయంత్రం ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టారు. ఇక.. సరైన ఎత్తులో, సరైన సమయంలో, సరిపడా ఇంధనాన్ని వినియోగించుకొని ల్యాండర్ తన ఇంజన్లను మండించుకోవాలి. ల్యాండర్ మాడ్యూల్ లో పారా మీటర్లన్నింటినీ తనిఖీ చేసి ఎక్కడ సాఫ్ట్ ల్యాండ్ కావాలో నిర్దేశించుకున్న తర్వాత బెంగళూరు లోని ఇండియన్ డీప్ స్పేస్ నెట్ వర్క్ నుంచి ఇస్రో సంబంధిత కమాండర్లను ల్యాండర్ మాడ్యూల్ కు అప్లోడ్ చేసింది. ల్యాండింగ్ షెడ్యూల్ కు 2 గంటల ముందు ఇది చేపట్టారు. కాగా ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలోని జోహెన్నస్‌బర్గ్ నుంచి వర్చువల్‌గా వీక్షించారు.