Begumpet Railway Station | తెలంగాణలోని బేగంపేట్ రైల్వే స్టేషన్ హైటెక్ హంగులు, అత్యాధునిక సౌకర్యాలతో తన రూపురేఖలనే మార్చుకుంటోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్‌లను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణలో అనేక రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. కాగా హైదరాబాద్ బేగంపేట రైల్వేస్టేషన్ లో కూడా 65 శాతం డెవలప్ మెంట్ పనులు పూర్తయ్యాయి. ఈ సమగ్ర పునరుద్ధరణ తర్వాత ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి. బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునిక రవాణా కేంద్రంగా మారనుంది.
ఏయే సౌకర్యాలున్నాయి?
బేగంపేట స్టేషన్ లో అభివృద్ధి పనుల్లో చాలావరకు భాగాలు ఇప్పటికే పూర్తయ్యాయి
ఎంట్రీ ర్యాంప్ : కొత్త ఎంట్రీ ర్యాంప్‌ని ఏర్పాటు చేయడం ద్వారా స్టేషన్‌కి ప్రయాణికులు సులభంగా ప్రవేశించవచ్చు. విభిన్న రకాల ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా ఈజీగా స్టేషన్ లోకి రాకపోకలు చేయవచ్చు.
12M ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ : 12 మీటర్ల కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FOB) నిర్మించారు. ఇది ప్లాట్‌ఫారమ్‌ల మధ్య సురక్షితంగా, సులభంగా మారవచ్చు. దీనివల్ల తరచుగా ప్లాట్‌ఫారమ్‌లను దాటాల్సిన ప్రయాణీకులకు ఇక్కట్లు తొలగిపోనున్నాయి.
లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌లు : బేగంపేట రైల్వేస్టేషన్ లో అదనంగా లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌ల నిర్మాణంతో స్టేషన్ అన్ని వయసుల ప్రయాణికులకు సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి రద్దీ సమయాల్లో ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తాయి.
గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, పెరుగుతున్న ప్రయాణీకుల అవసరాలను స్టేషన్ తీర్చేలా చేయడానికి ఇంకా కీలకమైన ప్రాంతాలు అభివృద్ధిలో ఉన్నాయి:
స్టేషన్ బిల్డింగ్ : స్టేషన్ భవనం పునరుద్ధరణ చురుకుగా సాగుతోంది. ప్రయాణీకుల సేవలు సౌకర్యాన్ని మెరుగుపరచడానికి వేగంగా పనులు చేపడుతున్నారు. కొత్త బిల్డింగ్ డిజైన్ అప్‌గ్రేడ్ చేసిన వెయిటింగ్ రూమ్‌లు, మెరుగైన టికెటింగ్ సౌకర్యాలుఉన్నాయ.ి
సర్క్యులేటింగ్ ఏరియా, అప్రోచ్ రోడ్ : సర్క్యులేటింగ్ ఏరియా, అప్రోచ్ రోడ్‌ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చు. ప్రయాణీకుల రాకపోకలు సులభతరమవుతాయి.
ప్లాట్‌ఫారమ్ విస్తరణ : ప్లాట్‌ఫారమ్‌లు పొడవైన రైళ్లకు అనుగుణంగా విస్తరిస్తున్నారు. స్టేషన్ లో నిలిచే రైళ్లు సంఖ్య పెరుగుతోంది. తద్వారా ప్రయాణీకుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్లాట్ ఫారమ్ ను పొడిగిస్తున్నారు.
బేగంపేట రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు పూర్తయితే రోజువారీ కార్యకలాపాలు మెరుగుపడటమే కాకుండా ప్రయాణీకులకు మరింత స్థిరమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. ఇప్పటికే 65 శాతం పనులు పూర్తి కాగా, బేగంపేట రైల్వే స్టేషన్ తెలంగాణలో సమర్థవంతమైన ఆధునిక రవాణాకు ల్యాండ్‌మార్క్‌గా మారుతోంది.