
న్యూఢిల్లీ : తెలంగాణలో హిందువులను మైనారిటీలుగా మార్చాలనే కుట్రతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. బీసీల కోసం కాకుండా కేవలం ముస్లింలకు వంద శాతం రిజర్వేషన్లు కల్పించేందుకే ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేపట్టిందని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా హామీ ఇచ్చిన కాంగ్రెస్, అసలు ఆ డిక్లరేషన్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అందులో 10 శాతం రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టాలన్న పథకంతోనే బీసీలను మోసం చేస్తున్నారన్నారు.
‘‘ఇది అసలు బీసీ డిక్లరేషన్ కాదు. ముస్లిం డిక్లరేషన్ మాత్రమే’’ అని స్పష్టంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 27% రిజర్వేషన్లు అమలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రతిపాదన వల్ల బీసీలకు అదనంగా 5% మాత్రమే లభించబోతోంది. మతాధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, అంబేడ్కర్ భావనలతో కాంగ్రెస్ వ్యతిరేకంగా వెళ్తోంది అని బండి సంజయ్ విమర్శించారు.
‘‘కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 50 ఏళ్లు పాలించినా ఒక్కసారి కూడా బీసీ నేతను ప్రధాని చేయలేదు. బీజేపీ మాత్రమే బీసీ వ్యక్తిని మూడుసార్లు ప్రధానిగా చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రపతి పదవి దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు ఇవ్వాలన్న సంకల్పం బీజేపీకే ఉందని స్పష్టం చేశారు.
రేవంత్ కేబినెట్‌లో బీసీలకు ఎంత న్యాయం?
తెలంగాణ సీఎంగా రెవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత బీసీలకు ఎంతమంది మంత్రి పదవులు, నామినేటెడ్ హోదాలు లభించాయో సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ‘‘బీసీలను మోసం చేస్తూ, ముస్లింలకు ప్రయోజనం చేకూర్చే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తే… బీసీలు, హిందువులు ఒక్కటై తిరగబడే రోజు దూరం లేదు’’ అని హెచ్చరించారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ ఈ విష వృక్షాన్ని నాటితే, అది దేశమంతా వ్యాపించే ప్రమాదం ఉంది’’ అని ఆయన హెచ్చరించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.