New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీ మరింత ఆలస్యం, ఆరు గ్యారంటీల అర్జీల తర్వాతేనా?
New Ration Cards : గత వారం రోజులుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. కేవలం ఊహాగానాలతో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వార్తలేనని నిర్ధారణ అయింది. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ల సమీక్షలో రేషన్ కార్డుల గురించి ప్రస్తావిస్తారని ఎదురు చూస్తున్న ప్రజలకు ఆ అంశం గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కేవలం 6 గ్యారంటీల అమలుపై ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని, ఆయా గ్రామాల్లో జరిగే గ్రామసభల్లో ప్రజలు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశాలిచ్చారు. వారం రోజుల పాటు కొనసాగే ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ఎప్పుడు?
ఇలా ఉండగా, కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వమైనా మంజూరు చేస్తుందని ఆశించగా తీరా అందరి ఆశలు ఆవిరయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్లుగా కొత్త రేషన్ కార్డులు, కొత్తగా జన్మించిన వారి పేర్ల నమోదు ప్రక్రియ చేపట్టలేదు. కేవలం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుల వరకే పరిమితమయ్యాయి. గత రాష్ట్ర ప్రభుత్వం ఒక్క దరఖాస్తు కూడా పరిశీలించలేదు. దీంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు పేరుకుపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు రావడం అందరూ రెవెన్యూ కార్యాలయాలు, మీ సేవ సెంటర్ల వద్ద బారులు తీరారు. దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు కులం, నివాసం, ఆదాయం ధ్రువపత్రాల కోసం మీ సేవలో అప్లై చేసుకున్నారు.
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
చివరికి అధికారులు.. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని, ఆ వార్తలు అవాస్తవమని , సోషల్మీడియా వార్తలు నమ్మి ఆందోళన చెందవద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా అధికారికంగా ప్రకటన కూడా చేశారు.
ప్రజాపాలనలో దరఖాస్తులు
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈనెల 28 నుంచి చేపడుతున్న ‘ప్రజాపాలన’ కార్యక్రమం ఎక్కువ శాతం రేషన్ కార్డులపై నే నడుస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజాపాలనకు వచ్చే అధికారులకు 6 గ్యారంటీల కంటే ఎక్కువ దరఖాస్తులు రేషన్ కార్డుల కోసమే వచ్చే అవకాశముందని చెబుతున్నారు. కాగా ప్రజాపాలనలో దరఖాస్తులతో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు తప్పనిసరి జత చేయాలని సూచించింది ప్రభుత్వం. రేషన్ కార్డు లేనప్పుడు ఏ విధంగా జత చేస్తామని కొందరు ప్రశ్నిస్తున్నారు.
New Ration Cards జారీ ప్రక్రియ ఎప్పుడు?
కొత్త తెల్లరేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణకు మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. ప్రభుత్వం 6 గ్యారంటీల దరఖాస్తులు స్వీకరిస్తామని, వాటికి తెల్లరేషన్ కార్డును అర్హత గా ప్రభుత్వం నిర్ణయించింది.. రేషన్ కార్డులు జారీ చేసే వరకు వేచి చూస్తే ఆరు గ్యారంటీల అమలు మరింత ఆలస్యమవుతుంది. ఆ ఉద్దేశంతో 6 గ్యారంటీల దరఖాస్తులను స్వీకరించిన తర్వాతే కొత్త రేషన్ కార్డుల అర్జీలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..