భద్రకాళి చెరువుకు గండి

భద్రకాళి చెరువుకు గండి

కాలనీలోకి దూసుకువస్తున్న వరద నీరు..
అప్రమత్తమైన అధికారులు
సమీప కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

వరంగల్: వరంగల్‌లోని చారిత్రక భద్రకాళి చెరుకువుకు గండి పడింది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో చెరువులోకి భారీగా నీరు వచ్చిచేరింది. సామర్థ్యానికి మించి వరద రావడంతో పోతన నగర్ వైపు ఉన్న చెరువు కట్ట తెగిపోయింది.. దీంతో చెరువులోని నీరంతా ఉధృతంగా బయటకు ప్రవహిస్తున్నది.. సరస్వతినగర్, పోతననగర్ తోపాటు చుట్టు ఉన్న కాలనీల వైపు వేగంగా వరద నీరు దూసుకువస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.. కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.. అలాగే గండి పూడ్చే పనికోసం సిబ్బందిని అక్కడికి తరలిస్తున్నారు.
మరోవైపు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్ ప్రావిణ్య, నగర మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో ముంపు బాధితులకు సహాయ, పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ముంపునకు గురైన సంతోషిమాత కాలనీలో పర్యటించిన
శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్,

వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గం హంటర్ రోడ్డులో ముంపునకు గురైన పలు కాలనీలను శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కార్పొరేటర్ గందే కల్పన నవీన్ శనివారం ట్రాక్టర్ లో పర్యటించారు.
ఈ సందర్భంగా కాలనీల్లో ఉన్నవారికి తాగునీరు, ఫుడ్ ప్యాకెట్స్ అందజేశారు. ఎవరూ అధైర్యపడొద్దని, అందరికీ అండగా ఉంటామని భరోసానిచ్చారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో అధిక వర్షపాతం నమోదైందని, అందుకే ఈ సమస్య తలెత్తిందన్నారు. రూ.156 కోట్లతో సంతోషిమాత కాలనీ, ఎన్టీఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో అండర్ వాటర్ డ్రైనేజీ నిర్మాణానికి పూనుకున్నామని, అనుమతులు కూడా వచ్చాయని అంతలోనే ఈ వర్షం ఇబ్బందులకు గురిచేసిందని ఎమ్మెల్యే వారికి వివరించారు. వర్షం తగ్గుముఖం పట్టేంత వరకు ఓపికగా ఉండి తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరారు. అత్యవసర పరిస్థితుల్లో తమని సంప్రదించాలని కోరారు. వరదనీరు పోయేవరకు సహాయక చర్యలు అందిస్తామని, ఆహారం తాగునీరు పంపిణీ చేస్తామని ఎవరు భయాందోళన చెందవద్దని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.

READ MORE  Rainfall | తెలంగాణ‌లో మూడు రోజులు వ‌ర్షాలు.. హైద‌రాబాద్ కు ఎల్లో అల‌ర్ట్‌..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *