
Vaishno Devi Medical College Admissions Controversy : శ్రీ మాతా వైష్ణో దేవి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ (SMVDIME)లో మొదటి బ్యాచ్ MBBS ప్రవేశాలు తీవ్ర రాజకీయ దుమారానికి, సామాజిక ఉద్రిక్తతలకు దారితీశాయి. విద్యార్థుల ఎంపికలో ఒక నిర్దిష్ట వర్గానికి మాత్రమే భారీగా సీట్లు దక్కడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హిందూ సంఘాలు జమ్మూలో భారీ ఎత్తున నిరసనలు చేపట్టాయి.
ఘటనా స్థలంలో ఉద్రిక్తత
జమ్మూలోని లోక్ భవన్ వద్ద ‘శ్రీ మాతా వైష్ణో దేవి సంఘర్ష్ సమితి’ ఆధ్వర్యంలో ఆందోళనకారులు పెద్ద ఎత్తున గుమిగూడారు. కేంద్రంలోని తమ సొంత ప్రభుత్వం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ (LG) మనోజ్ సిన్హాకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ (BJP) మహిళా విభాగం కూడా ఈ నిరసనలో చేరడం గమనార్హం. నిరసనకారులు ఎల్జీ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఎల్జీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు జనాన్ని అదుపు చేసే క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది.
అసలు సమస్య ఏమిటి?
మెడికల్ కాలేజీ (Vaishno Devi Medical College)లో మొదటి బ్యాచ్‌గా ఎంపికైన 50 మంది విద్యార్థుల జాబితా బయటకు రావడంతో వివాదం మొదలైంది. ఈ జాబితాలో: కాశ్మీర్ నుంచి ముస్లిం విద్యార్థులు 42 మంది, జమ్మూ నుండి హిందూ విద్యార్థులు: 7 మంది, సిక్కు విద్యార్థి ఒకరు ఎంపికయ్యారు. శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు నిధులతో నడుస్తున్న ఈ సంస్థలో, హిందూ విద్యార్థులకు ప్రాధాన్యత లేకపోవడంపై సంఘర్ష్ సమితి తీవ్రస్థాయిలో మండిపడుతోంది. “సనాతన ధర్మ పుణ్యక్షేత్రంలో ఈ విధమైన ఎంపిక ఆమోదయోగ్యం కాదు. అవసరమైతే ఈ కాలేజీని మూసివేయండి లేదా మరెక్కడికైనా తరలించండి” అని నిరసనకారులు డిమాండ్ చేశారు.
సంఘర్ష్ సమితి కన్వీనర్ కల్నల్ సుఖ్‌వీర్ సింగ్ మంకోటియా మాట్లాడుతూ, “హిందూ భక్తులు మాతా వైష్ణో దేవికి సమర్పించే కానుకలను కేవలం సనాతన ధర్మం, గురుకులాలు, గోశాలలు, దేవాలయాల సంరక్షణకే ఉపయోగించాలి. 1988లో ఏర్పడిన బోర్డు భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా పనిచేయాలి” అని పేర్కొన్నారు.
జాతీయ వైద్య కమిషన్ (NMC) వైఖరి:
అంతకుముందు, ఈ కాలేజీలోని 100 శాతం సీట్లను ఆల్ ఇండియా కోటా (AIQ) కింద భర్తీ చేయాలన్న బోర్డు ప్రతిపాదనను జాతీయ వైద్య కమిషన్ తిరస్కరించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సీట్లను రాష్ట్ర కోటా, ఆల్ ఇండియా కోటా మధ్య విభజించాల్సి ఉంటుందని, ఒక సంస్థ కోసం ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలంటే విధానపరమైన సవరణలు అవసరమని ఎన్ఎంసీ స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఉన్న అడ్మిషన్ల జాబితాను రద్దు చేసి, హిందూ విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కేంద్రం నియమించిన ఎల్జీపై బీజేపీ విభాగాలు నిరసన తెలపడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతానికి జమ్మూలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ప్రభుత్వం లేదా శ్రైన్ బోర్డ్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

