ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు .. కొత్త పార్టీ పెట్టిన హుమాయున్ కబీర్..!
West Bengal Politics | కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీఎంసీ నుంచి సస్పెండ్ అయిన భరత్‌పూర్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ (Humayun Kabir) తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ తరహా మసీదుకు పునాది వేసి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన కబీర్, ఇప్పుడు ‘జనతా ఉన్నయన్ పార్టీ’ (Janata Unnayan Party) అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు.
ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు
మరోవైపు, హుమాయున్ కబీర్ సభ్యత్వంపై పశ్చిమ బెంగాల్ (West Bengal ) అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ సోమవారం కీలక ప్రకటన చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు.
బెల్దంగాలో జరిగిన బహిరంగ సభలో కబీర్ ప్రసంగిస్తూ.. వచ్చే ఆరు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గద్దె దించడమే తన ఏకైక లక్ష్యమని ప్రకటించారు. తన కొత్త పార్టీ తరఫున ఇప్పటికే 8 మంది అభ్యర్థులను ప్రకటించారు. తాను స్వయంగా ముర్షిదాబాద్‌లోని రెజినగర్ మరియు బెల్దంగా అనే రెండు స్థానాల నుండి పోటీ చేస్తానని వెల్లడించారు.
కాదా బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై విమర్శలు గుర్పించారు. ఇప్పుడు పాత మమత కాదు. ఆమె సామాన్యులకు అందనంత దూరంలోకి వెళ్లిపోయారు” అని ఆరోపించారు.
ఇదంతా టీఎంసీ డ్రామా: బీజేపీ ఆగ్రహం
కబీర్ కొత్త పార్టీ స్థాపించడంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇదంతా ఓట్లను చీల్చడానికి టీఎంసీ ఆడుతున్న నాటకమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య ఆరోపించారు. బీజేపీకి పడే జాతీయవాద ఓట్లను చీల్చడానికే కబీర్ ప్రయత్నిస్తున్నారని, ఆయన ఇప్పటికీ టీఎంసీతో రహస్య సంబంధాలు కలిగి ఉన్నారని బీజేపీ విమర్శించింది. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో, బెంగాల్ ప్రజలు ఇలాంటి ఛాందసవాద రాజకీయాలను తిరస్కరించి బీజేపీని ఎన్నుకుంటారని భట్టాచార్య ధీమా వ్యక్తం చేశారు.
కబీర్ – ఒక రాజకీయ ఫిరాయింపుల చరిత్ర
- హుమాయున్ కబీర్ రాజకీయ ప్రస్థానం గందరగోళంగా సాగింది.
- 2015లో మమతా బెనర్జీని విమర్శించినందుకు టీఎంసీ నుంచి 6 ఏళ్లు బహిష్కరణకు గురయ్యారు.
- 2016లో స్వతంత్రంగా పోటీ చేసి ఓడిపోయారు.
- తర్వాత కాంగ్రెస్‌లో చేరి, 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలోకి వెళ్లారు.
- బీజేపీ తరఫున ముర్షిదాబాద్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత, మళ్లీ టీఎంసీలోకి వచ్చి 2021లో ఎమ్మెల్యే అయ్యారు.
- తాజాగా డిసెంబర్ 6న బాబ్రీ తరహా మసీదుకు పునాది వేసి టీఎంసీ నుంచి సస్పెండ్ అయ్యారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కొత్త పార్టీ ప్రభావం ముర్షిదాబాద్ జిల్లాలో టీఎంసీ, బీజేపీ గెలుపోటములను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


