
Bhojshala | మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న 11వ శతాబ్దం నాటి భోజ్‌శాల కట్టడం వద్ద రేపు (జనవరి 23) వసంత పంచమి వేడుకల నిర్వహణపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. ఈసారి వసంత పంచమి శుక్రవారం కలిసి రావడంతో నెలకొన్న ఉత్కంఠకు అత్యున్నత న్యాయస్థానం తెరదించింది.
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు హిందువులు వసంత పంచమి పూజలు, హవనాలు నిర్వహించుకోవచ్చు. ఇక ముస్లింలు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ముస్లింలు శుక్రవారం నమాజ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది.
నమాజ్ సమయం (1 PM – 3 PM) లో ముస్లింల కోసం కాంప్లెక్స్ లోపల ఒక ప్రత్యేక ప్రాంతాన్ని కేటాయించాలని, వారికి వేర్వేరుగా వచ్చే (Entry), వెళ్లే (Exit) మార్గాలను ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. ప్రార్థనలకు వచ్చే వారి జాబితాను ముందే జిల్లా యంత్రాంగానికి అందజేయాలని ముస్లిం కమిటీని కోర్టు ఆదేశించింది.

హిందువులు ప్రార్థనలు చేసుకోవడానికి ప్రత్యేక స్థలం
రెండు వర్గాల వారు శాంతియుతంగా ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా తగిన శాంతిభద్రతల ఏర్పాట్లు చేయాలని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోర్టు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.
“పూజా ఆచారాలు నిర్వహించడానికి హిందూ సమాజానికి ప్రత్యేక స్థలం అందించబడుతుంది, సమయాలపై ఎటువంటి పరిమితి లేకుండా, రోజంతా ప్రార్థనలు కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. ముస్లిం సమాజానికి, నమాజ్ మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు నియమించబడిన ప్రత్యేక ప్రాంతంలో జరుగుతుంది. జిల్లా యంత్రాంగం తదనుగుణంగా అన్ని ఏర్పాట్లు జరిగేలా చూసుకుంటుంది మరియు శాంతిభద్రతలను కాపాడుతుంది. పరస్పర గౌరవం మరియు సహనాన్ని పాటించాలని మరియు శాంతిభద్రతల నిర్వహణలో రాష్ట్ర మరియు జిల్లా పరిపాలనతో సహకరించాలని మేము ఇరుపక్షాలను అభ్యర్థిస్తున్నాము” అని సుప్రీంకోర్టు పేర్కొంది.
నమాజ్ చేయడానికి ఎంత మంది వ్యక్తులు వస్తారనే వివరాలను జిల్లా యంత్రాంగానికి ముందుగానే అందించాలని, తద్వారా పాస్‌లతో సహా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
శాంతి భద్రతలపై హై అలర్ట్
ఈ సున్నితమైన అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ధార్ జిల్లా వ్యాప్తంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
8,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. CRPF, RAF బలగాల పహారా ఏర్పాటు చేయనున్నారు. CCTV కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఉంటుంది. సోషల్ మీడియా పోస్టులపై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
Bhojshala : నేపథ్యం ఏమిటి?
హిందువులు దీనిని సరస్వతీ దేవి ఆలయంగా (వాగ్దేవి) భావిస్తారు, ముస్లింలు దీనిని కమల్ మౌలా మసీదుగా పిలుస్తారు. 2003లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఇచ్చిన నిబంధనల ప్రకారం: మంగళవారం: హిందువులు పూజలు, శుక్రవారం: ముస్లింలు నమాజ్ చేస్తున్నారు. అయితే, వసంత పంచమి శుక్రవారం నాడు వస్తే ఏంచేయాలనే దానిపై గతంలో స్పష్టత లేదు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు ఇరువర్గాల మధ్య శాంతిని నెలకొల్పడానికి దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

