ఇల్లు ఖాళీ చేయించిందని కిరాతకం
అర్ధరాత్రి బాలిక సహా
ఇంటి ఓనర్ దారుణ హత్య..
హైదరాబాద్ : అద్దె ఇంటిలో ఉంటూ భార్యాభర్తలు నిత్యం గొడవలు పెట్టుకుంటుండడంతో ఇల్లు ఖాళీ చేయమన్నందుకు పగతో రగిలిపోయాడు.. ఆవేశంతో ఇంటి ఓనర్అ యిన వృద్ధురాలితో పాటు ఆమె మనవరాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ వెంటనే ఓనర్ఇంట్లో ఉన్న బంగారంతో పరారయ్యాడు. రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామంలో జరిగిన ఈ జంట హత్యల కేసును చాకచక్యంగా పోలీసులు ఛేదించారు. గతంలో ఇంట్లో కిరాయికి ఉన్న వ్యక్తే ఈ కిరాతకానికి పాల్పడినట్లు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. పార్వతమ్మ నందిగామ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తోంది. పార్వతమ్మ భర్త ఏడేళ్ల క్రితం చనిపోయాడు. ఈమెకు ఇద్దరు కొడుకులున్నారు. ఒక కొడుకు చనిపోగా.. మరొక కొడుకు ఎక్కడికో వెళ్లిపోయాడు. పార్వతమ్మ ఒక్కతే తనకున్న ఇంట్లో నివాసముంటోంది. పార్వతమ్మకు ఎవరూ లేకపోవడంతో తన చెల్లె కొడుకు కృష్ణయ్య కుమార్తె భానుప్రియను ఇంట్లో పడుకోవడానికి, అలాగే తనకు చేదోడువాదోడుగా ఉంచుకునేందుకు పిలుచుకుంటుంది. అయితే మే నెలలో దివాకర్ సాహు, అతడి భార్య అంజలితో కలిసి పార్వతమ్మ ఇంట్లో కిరాయికి వచ్చారు. దివాకర్ సాహు, అంజలి ఇద్దరూ బీహార్ రాష్ట్రానికి చెందినవారు అయితే, తరచు గొడవపడుతుండడంతో పార్వతమ్మ వారిని ఇల్లు ఖాళీ చేయించింది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న దివాకర్ సాహు పార్వతమ్మపై పగ పెంచుకున్నాడు. పార్వతమ్మ ఇంట్లో ఉంటున్న క్రమంలో ఆమెకు ఎవరూ లేరని, ఆమె వద్ద డబ్బు, బంగారు ఆభరణాలు ఉన్నట్టు గమనించాడు.
ఇల్లు ఖాళీ చేసిన తర్వాత దివాకర్.. పార్వతమ్మ ఇంటికి దగ్గరలోనే మరో ఇంట్లోకి కిరాయికి దిగాడు. పార్వతమ్మపై ప్రతీకారం తీర్చుకోవడానికి సమయం కోసం ఎదురుచూస్తూవచ్చాడు. జూన్ 16న దివాకర్ ఇంట్లో నుండి అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో కాలకృత్యాలకు వెళుతున్నానని భార్య అంజలితో చెప్పి పార్వతమ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడి ప్రహరీ గోడ దూకి .. బయటపడుకొని ఉన్న పార్వతమ్మ, ఆమె మనవరాలు భానుప్రియను ఇటుకతో తలపై కొట్టాడు. అనంతరం కిరాతకంగా కత్తితో గొంతు కోసి చంపాడు. అనంతరం బీరువా తాళాలను తీసుకొని రెండు వరసుల బంగారు పుస్తెలతాడు, ఆభరణాలను, డబ్బులను ఎత్తుకెళ్లాడు.
ఐదు గంటల్లోనే నిందితుడి అరెస్ట్
స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి ఈ కేసును కేవలం ఐదు గంటల్లోనే ఛేదించారు. నాలుగు పోలీసు బృందాలు వేర్వేరుగా హంతకుల కోసం జల్లెడ పట్టి బిహారీ దంపతులను పట్టుకున్నాయి. కాగా.. అల్లారుముద్దుగా పెంచుకున్న భానుప్రియను హత్య చేసిన నిందితులను ఉరిశిక్ష విధించాలని చిన్నారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
హత్య చేసిన నిందితుడు దివాకర్.. నందిగామ గ్రామ పరిధిలో ఉన్న ఎంఎస్ఎన్ కంపెనీలో పని చేస్తున్నాడు. పరిసర ప్రాంతాల్లో కంపెనీలు ఉండడంతో బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వలస వచ్చే వారు ఇక్కడి గ్రామంలో ఇళ్లను అద్దెకు తీసుకొని ఉంటున్నారు. కాగా ఈ ఘటనతో ఎవరైనా పరాయి వ్యక్తులకు ఇళ్లను అద్దెకివ్వాలంటే ఇక్కడ గ్రామస్తులు భయపడిపోతున్నారు. మరోవైపు ఎవరైనా ఇళ్లకు అద్దెకు వస్తే వారి బయోడేటాను ఆధార్ కార్డులను కచ్చితంగా తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.