యాప్‌ను తొలగించే స్వేచ్ఛ వినియోగదారులదే: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టీకరణ
న్యూఢిల్లీ : టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) భారతదేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో ‘సంచార్ సాథి’ యాప్ (Sanchar Saathi App) ను ముందే ఇన్‌స్టాల్ చేయాలని మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీదారులను ఆదేశించింది. అయితే, దీనిపై వినియోగదారుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తాజాగా స్పష్టత ఇచ్చారు. వినియోగదారులు తమకు ఇష్టం లేకుంటే ఆ యాప్‌ను తమ ఫోన్ల నుంచి తొలగించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
90 రోజుల్లో యాప్ ఇన్‌స్టాలేషన్ తప్పనిసరి
సిమ్‌కార్డుల దుర్వినియోగాలు, సైబర్ మోసాలను నివేదించే అప్లికేషన్ అయిన ‘సంచార్ సాథి’ని, ఉత్తర్వులు జారీ అయిన 90 రోజులలోపు భారతదేశంలో తయారు చేయబడిన లేదా దిగుమతి చేసుకున్న అన్ని కొత్త మొబైల్ హ్యాండ్‌సెట్‌లలో ముందే ఇన్‌స్టాల్ చేయాలని DoT ఆదేశించింది. ఈ ఆదేశం Apple, Samsung, Google, Vivo, Oppo, Xiaomi వంటి ప్రధాన మొబైల్ కంపెనీలన్నింటికీ వర్తిస్తుంది.
మంత్రి సింధియా ఏమన్నారు?
“మీరు సంచార్ సాథి వద్దు అనుకుంటే మీరు దానిని తొలగించవచ్చు. ఇది వారి ఐచ్ఛికం… ఈ యాప్‌ను అందరికీ పరిచయం చేయడం మన విధి. దానిని వారి డివైజ్‌లలో ఉంచుకోవాలా వద్దా అనేది వినియోగదారుడి ఇష్టం” అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
DoT జారీ చేసిన అధికారిక ఉత్తర్వులలో కంప్లైయన్స్ (పాటించాల్సిన) నిబంధనలు ఇలా ఉన్నాయి:
ఇప్పటికే ఉన్న స్మార్ట్‌ఫోన్లు : ఇప్పటికే తయారు చేయబడి, మార్కెట్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్ల కోసం, తయారీదారులు సాఫ్ట్‌వేర్ నవీకరణల (Software Updates) ద్వారా ‘సంచార్ సాథి’ యాప్‌ను వినియోగదారులకు పంపాలి.
యూజర్ విజిబిలిటీ: ముందే ఇన్‌స్టాల్ చేయబడిన యాప్ మొదటిసారి ఉపయోగించే సమయంలో లేదా డివైజ్ సెటప్ సమయంలో తుది వినియోగదారులకు సులభంగా కనిపించేలా, అందుబాటులో ఉండేలా కంపెనీలు చూడాలి. యాప్ కార్యాచరణలు నిలిపివేయబడకుండా లేదా పరిమితం చేయబడకుండా చూసుకోవాలి.
కంప్లైయన్స్ నివేదికలు: ఆదేశాలు జారీ చేసిన 120 రోజులలోపు అన్ని కంపెనీలు DoTకి కంప్లైయన్స్ నివేదికలను సమర్పించాలి.
నిబంధనలు పాటించని సంస్థలపై టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023, టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ 2024 ప్రకారం చర్యలు తీసుకుంటామని DoT హెచ్చరించింది.


