Navodaya Vidyalaya | తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలు( Kendriya Vidyalaya), నవోదయ విద్యాలయాలు(Navodaya Vidyalaya) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈమేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల మంజూరులో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట వేసింది. తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 8 కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించనుంది.
తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు
తెలంగాణకు కొత్తగా 7 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. నిజామాబాద్, జగిత్యాల, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలో కొత్త నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. మొత్తంగా దేశంలో కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాలను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు.
ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. అనకాపల్లి.. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ, నూజివీడు, చిత్తూరు జిల్లాలోని వలసపల్లె.. సత్యసాయి జిల్లా పాలసముద్రం.. గుంటూరు జిల్లాలోని తాళ్లపల్లి, రొంపిచర్ల.. నంద్యాల జిల్లాలోని డోన్‌లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..