
జమ్మూ–కాశ్మీర్ ఉగ్రవాద సంబంధాల దర్యాప్తులో కీలక మలుపు – Jammu Kashmir
హర్యానాలో 350 కిలోల పేలుడు పదార్థాలు, అస్సాల్ట్ రైఫిల్ స్వాధీనం
Jammu Kashmir | అనంత్‌నాగ్ ప్రభుత్వ వైద్య కళాశాలపై జమ్మూ కాశ్మీర్ పోలీసుల దర్యాప్తులో సంచనల విషయాలు వెలుగులోకి వచ్చాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో విస్తృత శోధనలు చేపట్టి, ఒక అస్సాల్ట్ రైఫిల్, సుమారు 350 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌కి సంబంధించి ఇప్పటికే అదుపులో ఉన్న రెండో వైద్యుడు అందించిన సమాచారంతో ఈ రికవరీ జరిగిందని తెలుస్తోంది. ఇందుకు ముందు అనంత్‌నాగ్ జీఎంసీ (GMC)లోని డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్ లాకర్ నుంచి AK–47 రైఫిల్ స్వాధీనం చేసుకున్న విషయం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అదీల్ అరెస్టు తర్వాత రెండవ వైద్యుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఉగ్రవాద సంబంధాలపై దర్యాప్తు
దర్యాప్తు అధికారుల ప్రకారం, ముగ్గురు వైద్యులపై ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానం వ్యక్తమైంది. వీరిలో అనంత్‌నాగ్, పుల్వామా ప్రాంతాలకు చెందిన ఇద్దరు వైద్యులు ఇప్పటికే అరెస్టయ్యారు. మూడవ వైద్యుడు పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అధికారులు వీరు “అన్సార్ గజ్వత్–ఉల్–హింద్” ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
డాక్టర్ లాకర్‌లో ఆయుధాలు
శుక్రవారం తెల్లవారుజామున అనంత్‌నాగ్ జీఎంసీ మాజీ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్ లాకర్ నుంచి AK–47 రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను శ్రీనగర్ పోలీసులు, జాయింట్ ఇంటరాగేషన్ సెంటర్ (JIC) సంయుక్తంగా నిర్వహించారు. డాక్టర్ అదీల్ 2024 అక్టోబర్ 24 వరకు GMC అనంత్‌నాగ్‌లో సీనియర్ రెసిడెంట్‌గా పనిచేశాడు. ప్రస్తుతం అదీల్ శ్రీనగర్ పోలీసుల కస్టడీలో ఉన్నారు.
కేసు నమోదు, దర్యాప్తు
ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆయుధ చట్టంలోని సెక్షన్లు 7/25తో పాటు UAPA చట్టంలోని 13, 28, 38, 39 సెక్షన్ల కింద కేసు నమోదైంది. డాక్టర్ రాథర్‌ను తదుపరి దర్యాప్తు కోసం కస్టడీలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆయుధం మూలం, దాన్ని కళాశాల లాకర్‌లో ఎలా దాచారన్న విషయంపై విచారణ కొనసాగుతోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.




