
- ద్రవ్యోల్బణంపై ప్రజాగ్రహం.. భద్రతా దళాల కాల్పుల్లో 45 మంది మృతి
- నిరసనకారులకు అమెరికా బాసట.. ఇరాన్ ప్రభుత్వానికి ట్రంప్ హెచ్చరిక
- ఇంటర్నెట్, గగనతలం మూసివేత!
Iran Protests : ఇరాన్ దేశం ప్రస్తుతం అగ్నిగుండంలా మారింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పడిపోతున్న కరెన్సీ విలువకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు.. ఇప్పుడు ఏకంగా ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ పతనాన్ని కాంక్షించే స్థాయికి చేరుకున్నాయి. జనవరి 8 (గురువారం) రాత్రి దేశవ్యాప్తంగా నిరసనకారులు వీధుల్లోకి రావడంతో పరిస్థితి అదుపుతప్పింది.
ప్రపంచం నుండి ఇరాన్ కట్!
నిరసనకారుల మధ్య కమ్యూనికేషన్‌ను దెబ్బతీయడానికి మరియు బాహ్య ప్రపంచానికి సమాచారం అందకుండా చేయడానికి ఇరాన్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలు, ల్యాండ్‌లైన్లను నిలిపివేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ తన మొత్తం వైమానిక ప్రాంతాన్ని (Airspace) మూసివేసినట్లు సమాచారం. మరోవైపు రాజధాని టెహ్రాన్‌తో సహా దాదాపు 100 నగరాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య భీకర ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ హింస (Iran Protests)లో 45 మంది ప్రాణాలు కోల్పోయారు.
మౌనం వీడండి: రెజా పహ్లావి పిలుపు
ఇరాన్ దివంగత షా కుమారుడు రెజా పహ్లావి చేసిన పిలుపుతో ఉద్యమం మరింత ఉధృతమైంది. “ఈ రాత్రి లక్షలాది మంది ఇరానియన్లు స్వేచ్ఛను కోరుతూ గళమెత్తారు. ప్రభుత్వం అన్ని మార్గాలను మూసివేసింది, ఉపగ్రహ సిగ్నళ్లను కూడా జామ్ చేసే అవకాశం ఉంది” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రజలకు మద్దతుగా అంతర్జాతీయ సమాజం మౌనం వీడాలని ఆయన కోరారు.
అమెరికా బహిరంగ మద్దతు – ట్రంప్ హెచ్చరిక
ఇరాన్ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. శాంతియుత నిరసనకారులపై కాల్పులు జరపడం ఆపాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ స్పందిస్తూ.. “స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ఇరాన్ ప్రజల పక్షాన అమెరికా నిలబడుతుంది. అణు కార్యక్రమంపై చర్చలు జరపడం ఇరాన్‌కు క్షేమదాయకం” అని పేర్కొన్నారు.
గత 12 రోజులుగా సాగుతున్న ఈ ఉద్యమం ఇరాన్ చరిత్రలో అతిపెద్ద నిరసనలలో ఒకటిగా మారుతోంది. ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతున్నా, నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో ఇరాన్ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

