Farmers Attack On Vikarabad Collector | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాకాలో ఫార్మా సిటీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపట్టారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజవకర్గం లగచర్ల గ్రామంలో ఓ ఫార్మాసంస్థ భూసేకరణ కోసం అధికారులు చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ ఉద్రిక్తంగా మారింది. గ్రామసభ నిర్వహించేందుకు రెవెన్యూ సిబ్బందితో కలిసి వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో స్థానికులు వాగ్వాదానికి దిగారు. గ్రామసభను ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామ సభ వద్ద ఉన్న ఇద్దరు రైతుల అభ్యంతరంతో కలెక్టర్ లగచర్ల గ్రామానికి చర్చల కోసం బయలుదేరారు.కలెక్టర్ గ్రామంలోకి రాగానే ఆయనకు వ్యతిరేకంగా రైతులు ఒక్కసారిగా నినాదాలతో హోరెత్తించారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్ వెనక్కి వెళ్లిపోవాలంటూ కారుపై రాళ్లను విసిరారు. కారు దిగి రైతులతో చర్చించి ఒప్పించేందుకు కలెక్టర్ ప్రతీక్‌జైన్ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే స్థానిక రైతులు సహనం కోల్పోయి కలెక్టర్ ప్రతీక్‌జైన్, తహశీల్దార్ కార్లపై రాళ్లు విసరడం ప్రారంభించారు. దీంతో పరిస్థితిని గమనించి అక్కడి నుంచి కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది వెంటనే వెనుదిరిగారు.
కాగా, వికారాబాద్‌లో ఫార్మా సెజ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఫార్మా కంపెనీల నుంచి వొచ్చే వ్యర్థాల వల్ల కాలుష్యం పెరిగిపోయి భూసారం పోతుందని, పంటలు తీవ్రంగా నష్టపోతాయని రైతులు, ఆందోళన చెందుతున్నారు. ఫార్మా సెజ్‌ను ఏర్పాటు చేస్తే కాలుష్యం కారణంగా భూములతో పాటు సర్వం కోల్పోతామన్మేన భయం రైతుల్లో నెలకొంది. ఈ క్రమంలోప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు అధికారులు ప్రజాభిప్రాయసేకరణ చేపట్టగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.