అస్సాంలో కల్లోలం సృష్టిస్తున్న వరదలు
నిరాశ్రయులైన వేలాది మంది ప్రజలు
కొట్టుకుపోయిన వంతెనలు, పంటపొలాలు
గౌహతి: Assam Floods అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా 37,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. అసోమ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వివరాల ప్రకారం.. 13 జిల్లాల్లోని 146 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. అస్సాంలోని బిస్వనాథ్, దర్రాంగ్, ధేమాజీ, దిబ్రూగర్, హోజై, లఖింపూర్, నాగావ్, సోనిత్‌పూర్, తిన్‌సుకియా, ఉదల్‌గురి, కాచర్, కమ్రూప్ (మెట్రో) నల్బారి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి.
వరదలు కారణంగా రహదారులు, వంతెనలు తెగిపోయాయి. 1,409 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో పంట పొలాలు తుచుకుపెట్టుకుపోయాయి. బ్రహ్మపుత్ర, పుతిమరి, కోపిలి సహా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.
అధికారులు బిస్వనాథ్, దిబ్రూఘర్, లఖింపూర్, టిన్సుకియా, ఉదల్గురి ప్రాంతాల్లో 19 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఉత్తర అస్సాంలోని సోనిత్‌పూర్, లఖింపూర్ జిల్లాల్లో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య అధ్యక్షతన శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య సంస్థలతో సమావేశమయ్యారు అస్సాంలో వరదల కారణంగా ఉత్పన్నమయ్యే ఆరోగ్య సంబంధిత సమస్యలపై చర్చించారు. వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఏజెన్సీలు ఏర్పాటు చేశారు.
వరదలు, ఇతర అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య సంస్థల మధ్య సమన్వయం అవసరమని మాండవ్య తెలిపారు. క్రిటికల్ కేర్ ఎక్విప్‌మెంట్, ఆక్సిజన్, హాస్పిటల్ బెడ్ల ను ఏర్పాటు చేయడంతోపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఇంకా, నీటి ద్వారా అంటువ్యాధులు వ్యాపించకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పర్యాటకులను రక్షించిన భద్రతా దళాలు
కొండచరియలు విరిగిపడటం, వంతెన కొట్టుకుపోవడం వల్ల సిక్కింలో చిక్కుకుపోయిన 3,500 మంది పర్యాటకులను భద్రతా దళాలు రక్షించాయి. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది, “త్రిశక్తి కార్ప్స్, ఇండియన్ ఆర్మీ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణంలో రాత్రిపూట పనిచేసి, పర్యాటకులను రక్షించారు. పర్యాటకులు నదిని దాటడానికి సహాయం చేశారు. వేడి భోజనం, గుడారాలు ఏర్పాటు చేసి వైద్య సహాయం అందించారు. రోడ్డు కనెక్టివిటీ పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, టెంట్లు, మెడికల్ ఎయిడ్ పోస్టులను ఏర్పాటు చేశామని’’ పేర్కొంది.
Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,
టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి