
Warangal Inner Ring Road | వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్-చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో మంగళవారం వరంగల్ నగర అభివృద్ధిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తో కలిసి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వరంగల్ స్మార్ట్ సిటీ, భద్రకాళి దేవస్థానం, మెగా టెక్స్ టైల్ పార్కు, వరంగల్ ఎయిర్ పోర్టు, నర్సంపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, సమీకృత రెసిడెన్షియల్ స్కూల్స్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అంశాల వారీగా అభివృద్ధి పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్ట్ ల కోసం రైతు సంతృప్తి చెందేలా మానవీయ కోణంలో భూసేకరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎయిర్ పోర్ట్ భూసేకరణ కోసం ఎయిర్ పోర్ట్ అథారిటి, ఆర్ అండ్‌బి అధికారులతో సమావేశం నిర్వహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఇదిలా వుండగా వరంగల్ నగరంలో ఒక జాతీయ రహదారిని మరో జాతీయ రహదారికి అనుసంధానం చేసే విధంగా ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్డును అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెల అధికారులకు సూచించారు. అలాగే నగరంలోని ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి టెక్స్‌టైల్ పార్కుకు అనుసంధానంగా రహదారిని అభివృద్ధి చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
త్వరలో అందుబాటులోకి నర్సంపేట మెడికల్ కాలేజీ
స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద చేపట్టిన పనులను ఈ డిసెంబర్ 31 వ తేదీ లోగా పూర్తి చేసేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలని అధికారులకు సూచించారు. కాళోజీ కళాక్షేత్రం పనులను ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని వచ్చే నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారని తెలిపారు.
చారిత్రాత్మక భద్రకాళీ దేవస్థానం అభివృద్ధి పనులను ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నర్సంపేట వైద్య కళాశాలలో ఈ ఏడాది నుంచే అడ్మిషన్స్ ను ప్రారంభించాలని నిర్ణయించడంపై వైద్య శాఖ అధికారులను మంత్రి అభినందించారు. ఈ నెల మూడవ వారంలో ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..