Saturday, March 1Thank you for visiting

vinayaka chavithi : వ్రత కథ విన్నా.. చదివినా ఎంతో పుణ్యఫలం.

Spread the love

Vinayaka Chavithi: వరంగల్: వినాయక చవితి పర్వదినం వచ్చేసింది. ఇప్పటికే అందరూ పూజా సామాగ్రి కొనుగోళ్లలో నిమగ్నమై పోయారు. ఈరోజు చేసే వినాయక పూజలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వినాయక వ్రత కథ (Vinayaka Chavithi vratham) గురించి.. ఈ కథను విన్నా.. చదివినా.. నీలాపనిందలకు దూరంగా ఉండొచ్చని సాక్షాత్తూ శ్రీకృష్ణుడు తెలిపాడు. మరి ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుని.. నిందలకు దూరంగా ఉందాం..

వినాయకుడి చరిత్ర (Vinayaka Chavithi story)

వినాయక చవితి పండుగ (Ganesh chathurthi) రోజు కచ్చితంగా వినాయక వ్రత కథ చదవాల్సిందే.. లేదా వినాల్సిందే అంటున్నారు వేద పండితులు. దీనివల్ల భక్తులకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. వినాయక వ్రతకథ చదివేవారు.. లేదా పూజల్లో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షింతలు తీసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై వేసుకోవాలి.ఇప్పుడు కథలోకి వెళ్దాం.. పురాణాల ప్రకారం… తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుడికి.. శ్రీమహావిష్ణువు విముక్తి కల్పించాడు. దీంతో భర్త రాక కోసం పార్వతి కైలాసంలో ఎదురుచూస్తూ ఉంటుంది. పతి రాక కోసం ఎదురుచూస్తూ.. స్నానానికి ఉపక్రమించింది. ఇందుకోసం ఒంటికి నలుగుపిండిని అద్దుకుంది. ఆ పిండితోనే ఓ అందమైన ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ రూపం చూసి పార్వతికి అమితానందం కలిగింది. తన తండ్రి పర్వతరాజు ఉపదేశించిన మంత్రంతో పార్వతి.. ఆ బొమ్మకు ప్రాణం పోసింది. ముద్దుగా ఉన్న బాలుడిని చూసి మురిసిపోయింది స్నానానికి వెళ్తూ.. బాలుని వాకిట కాపలాగా ఉంచింది.

విముక్తి పొందిన శివుడు అంతలోనే అక్కడికి రాగా.. బాలుడు తన తల్లి స్నానం చేస్తోందని, లోపలికి వెళ్లడానికి వీలు లేదని శివుడిని అడ్డుకుంటాడు. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు.. ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండిస్తాడు. బాలుడి అరుపు విన్న పార్వతీ దేవి.. జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు శివుడు. అతడి శక్తి సామర్థ్యాలను పరిశీలించిన శివుడు భాద్రపద శుద్ధ చవితినాడు గణాధిపత్యం కట్టబెట్టాడు.

ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడు.. నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసానికి చేరుకున్నాడు. వినాయకుని అవస్థలు చూసిన చంద్రుడు ఒక్కసారి నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని అంటారు. అలాగే చంద్రుడి దృష్టి సోకి విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీ దేవి.. పాపాత్ముడా..! నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు. కాబట్టి నిన్ను చూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక.. అని శపించింది.

సప్త ఋషుల సతీమణులకు నీలాపనిందలు

పార్వతీదేవి చంద్రుడిని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ.. అగ్నిదేవుడికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త మనసులో కోరిక తెలుసుకున్న స్వాహా దేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడి ని చేరింది. అయితే అగ్నిదేవుడితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన రుషులు వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుడిని చూడటం వల్లే రుషుల భార్యలు నీలాపనిందలపాలయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో అమ్మా.. నీవు చంద్రుడికి ఇచ్చిన శాపం వల్ల ఆపద కలిగింది. ఆ శాపాన్ని ఉపసంహరించుకుంటే బాగుంటుందని బ్రహ్మదేవుడు కోరగా.. అప్పుడు పార్వతీదేవి వెంటనే దానిని సవరించింది. ఏ రోజు చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుడిని చూడకుండా ఉండాలని శాపాన్ని సవరించింది. ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుడిని చూడకుండా జాగ్రత్తగా ఉండి.. అందరూ.. సుఖంగా ఉన్నారు.

శ్రీకృష్ణపరమత్ముడికీ తప్పలేదు..

ఇలా శ్రీకృష్ణుడు కూడా వినాయక చవితి రోజు చంద్రుడిని చూసి నీలాపనిందలకు గురయ్యాడు. సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడిని శ్రీకృష్ణుడే చంపి శమంతకమణిని అపహరించాడని.. సత్రాజిత్తు నిందించాడు. భాద్రపద శుద్ధ చవితిరోజు చంద్రబింబాన్ని చూడడం వల్లే ఈ నింద పడిందని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు శమంతకమణిని వెతికి తెచ్చి.. తనపై పడిన నిందను పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి గతి ఏంటి అని శ్రీకృష్ణుడిని ప్రశ్నించగా..

భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి.. ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షితలు తలపై వేసుకునేవారికి.. ఆరోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితిరోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లు గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివి, విని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version