
Train Derailment | దేశంలో రైలు ప్రమాదాలు జరిగేందుకు కుట్రపూరిత యత్నాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో దుండగులు రైలు ప్రమాదాలకు కుట్ర పన్నిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మహారాష్ట్రలో ఇదే తరహా ఘటన జరిగింది. సోలాపూర్ (Solapur) మార్గంలోని రైలు పట్టాలపై దుండగులు పెద్ద సిమెంట్ దిమ్మెను పెట్టారు. దానిని గమనించిన లోకో పైలట్ వెంటనే స్పందించి రైలు ఢీ కొట్టకుండా తప్పించాడు. లోకో పైలట్ సమయస్పూర్తితో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో..
ఉత్తరప్రదేశ్ లో ఆదివారం భివాండి-ప్రయాగ్‌రాజ్ కాళింది ఎక్స్‌ప్రెస్‌కు కాన్పూర్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. రైలుపట్టాలపై కొందరు దుండగులు గ్యాస్ సిలిండర్‌ను ఉంచారు. లోకో పైలెట్ గమనించి ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. అయినప్పటికీ ట్రెయిన్ సిలిండర్‌ను ఢీ కొనడంతో అది పట్టాలకు దూరంగా ఎగిరిపడింది. అయితే రైలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైలు ప్రమాదం జరగడానికి ఇది విద్రోహ చర్యగా భావిస్తున్నామని, ఘటనా స్థలిలో ఒక పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదైందని, త్వరలోనే దుండగులను పట్టుకుంటామని పోలీస్ అధికారి చెప్పారు.
రాజస్థాన్ అజ్మీర్ లో..
Cement Block on Railway Track : అదే రోజు రాజస్థాన్‌లోని అజ్మీర్ (Ajmer)లో రైలు ప్రమాదానికి దుండగులు కుట్ర పన్నినట్లు సమాచారం. పూలేరా – అహ్మదాబాద్ రూట్‌లో రైలు ట్రాక్‌పై దుండగులు సుమారు 70 కేజీల బరువైన సిమెంట్ దిమ్మెను (cement block) పెట్టారు. దీంతో రైలు సిమెంట్ దిమ్మెను ఢీకొని ముందుకు వెళ్లిపోయింది. ఈ ఘటనలో రైలు ఇంజిన్‌తోపాటు కొంత భాగం డామేజ్ అయింది. ఈ ఘటనపై లోకో పైలట్ ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలంలో విరిగిన సిమెంట్ దిమ్మెను గుర్తించారు. పోలీసులు రైల్వే యాక్ట్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తొలుత ట్రాక్ పై సిమెంట్ దిమ్మె వేసినట్లు ఉద్యోగులకు సమాచారం అందింది. ఘటనాస్థలిని పరిశీలించగా, దిమ్మె విరిగిపోయి కనిపించింది. అదే ట్రాక్ వద్ద కొంత దూరంలో రెండవ బ్లాక్ కూడా కనుగొన్నారు. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం ఇతర రాష్ట్ర సంస్థలతో సమన్వయంతో సంఘటనపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. అజ్మీర్ ఏఎస్పీ దీపక్ కుమార్ మాట్లాడుతూ, ఈ కేసులో ఉగ్రవాద కోణాన్ని తాము తోసిపుచ్చడం లేదని, రేంజ్ ఐజి ఆదేశాల మేరకు సిట్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.
నెల రోజుల్లో 18 రైలు ప్రమాద ఘటనలు..
గత నెల ఆగస్టు నుంచి ఈనెల 8 వరకు సుమారు 18 ఘటనలు రైలు ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నట్లు తెలిపింది. ఆదివారం ఒక్కరోజే రెండు ఘటనలు జరిగాయని భారతీయ రైల్వే పేర్కొంది. రైళ్లను పట్టాలు తప్పించేందుకే కొందరు కుట్రలు పన్నుతున్నారని తెలిపింది. ఈ 18 ఘటనల్లో 15 ప్రమాదాలు ఆగస్టులో జరిగాయి. మరో మూడు సెప్టెంబర్‌లో జరిగినట్లు పేర్కొంది. రైలు ట్రాక్‌లపై పెద్ద బండ రాళ్లు, సిమెంటు దిమ్మెలు, ఎల్పీజీ సిలిండర్లు, చెక్క దుంగలను పెడుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపింది. కొందరు సైకిళ్లు, ట్రాక్టర్లు, ఇనుప రాడ్‌లు కూడా పెడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లో ఆ తర్వాత పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగినట్లు వివరించింది. ఇక జూన్ 2023 నుంచి ఇప్పటి వరకూ ఈ తరహా ఘటనలు 24 జరిగినట్లు ఇండియన్ రైల్వేస్ వివరించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..