Tuesday, March 4Thank you for visiting

Telangana Temples | రాష్ట్రంలో దేవాలయాలకు మహర్దశ.. రాయగిరిలో 20 ఎకరాల్లో వేద పాఠశాల

Spread the love

తెలంగాణలో దేశంలోనే  రెండో అతిపెద్ద లింక్ బ్రిడ్జి 

Telangana Temples  | రాష్ట్రంలోని దేవాలయాలకు మహర్దశ పట్టనుంది. వేములవాడ రాజరాజేశ్వరస్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి, కీసర రామలింగేశ్వరస్వామి, రామప్ప ఆలయాలతోపాటు ఇత‌ర ప్ర‌ధాన ఆల‌యాల అభ‌వృద్ధికి తెలంగాణ ప్ర‌భుత్వం చ‌ర్య‌లకు ఉప‌క్ర‌మించింది. ప్రముఖ దేవ‌స్థానాలు.. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామితి, యాదాద్రి దేవాలయ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు, భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి మాస్టర్‌ ‌ప్లాన్ పై సచివాలయంలో మంత్రి కొండా సురేఖ దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ ప‌లు కీల‌క విష‌యాల‌ను మీడియాకు వెల్ల‌డించారు. ‌రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపట్టే అభివృద్ధి పనులు దేవాలయాల ప్రాశస్త్యం, క్షేత్ర విశిష్టతకు భంగం కలగకుండా, చారిత్రక ఆనవాళ్ళు దెబ్బతినకుండా జాగ్రత్తగా చేపట్టాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖమంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.

20 ఎకరాల్లో రూ.43 కోట్లతో వేద పాఠశాల

యాదగిరిగుట్ట ఆలయ గర్భగుడి విమాన గోపురం స్వర్ణ తాపడం, వేద పాఠశాల నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో గోవింద హరి ఛైర్మన్‌ ‌గా రాయగిరిలో 20 ఎకరాల్లో రూ.43 కోట్ల అంచనా వ్యయంతో వేద పాఠశాలను నిర్మించనుట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. అలాగే అన్నదాన సత్రాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. యాదాద్రి దేవస్థానానికి రాకపోకల నిమిత్తం ఎగ్జిట్‌ ‌ఫ్లై ఓవర్‌ ‌పైనే ఆధారపడిన భక్తులకు నెట్వర్క్ ఆర్చ్ ‌బ్రిడ్జ్ తో ‌ఉపశమనం లభించనున్నట్లు సురేఖ తెలిపారు. స్టీల్‌ ‌తో నిర్మిస్తున్న 64 మీటర్ల ఈ ఫ్లై ఓవర్‌ దేశంలోనే రెండవ అతి పొడవైన బ్రిడ్జ్ ‌కావడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. 3 నెలల్లో ఈ లింకింగ్‌ ‌నిర్మాణ పనులు పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

కీసర, రామప్ప ఆలయాల్లో..

కీసరగుట్ట దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని అధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి సూచనల ప్రకారం రామప్ప దేవాలయ స్ఫూర్తితో కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానం, నాట్య మండపం, పరిసరాలను తీర్చిదిద్దాలన్నారు. దేవాలయం చుట్టూ ఉన్న లక్ష్మీనరసింహా, ఆంజనేయ, నాగదేవతల ఆలయాలకు ఇబ్బంది కలగకుండా పనులు చేపట్టాలని సూచించారు. శ్రావణమాసం, దేవాలయ ప్రాశస్త్యాన్ని వివరించే పుస్తకాల ముద్రణతో పాటు వెబ్ సైట్ ను  ఆధునికీకరించాలని సూచించారు. శ్రీరాముడు ప్రతిష్టించినట్లుగా చెప్పబడుతున్న కీసరగుట్ట దేవాలయంలో శ్రీరాముడి విగ్రహాన్నిప్రతిష్టించాలని ఆదేశించారు.  కులవృత్తులు, మహిళాసంఘాల సభ్యులకు దేవాదాయ శాఖ తరఫున ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని, చేర్యాల నగిషీ చిత్రకళ, పోచంపల్లి చేనేత, పట్టు వస్త్రాల స్టాళ్లను ఏర్పాటు చేసి కళాకారులను ప్రోత్సహించాలని చెప్పారు. సవరణలతో కూడిన మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌పై సమీక్ష అనంతరం సీఎంకు సమర్పించి వెంటనే పనులను ప్రారంభించనున్నట్లు మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

భద్రాచల  ఆలయ భూముల్లో పూలు, తులసీ మొక్కల పెంపకం.. 

గోదావరి నదీ తీరంలోనే భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఉన్నందున నదికి వరదలు వస్తే ఆ ముంపునకు గురికాకుండా  చేపట్టిన పనుల వివరాలను ఆర్కిటెక్ట్ ‌సూర్యనారాయణ మూర్తి వివరించారు. యాదగిరి గుట్ట, భద్రాచలంలో  పూజా కార్యక్రమాలకు పూలు, తులసి వంటి పత్రాలను బయటి నుంచి కొనకుండా దేవాలయ భూముల్లోనే మొక్కలను పెంచాలని చెప్పారు. దేవాలయాన్ని ఆనుకుని ఉన్న రోడ్డు విస్తరణలో భాగంగా కుసుమ హరనాథ దేవాలయం దెబ్బతినే పరిస్థితులు ఉన్న నేపత్యంలో వేరే మార్గాలను మంత్రి సురేఖ సూచించారు. దక్షిణ భారతదేశంలో రాముడు తిరుగాడిన ప్రాంతాల వివరాలను వివరిస్తూ డిజిటల్‌ ‌మ్యూజియం ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించగా మంత్రి సురేఖ ఆమోదం తెలిపారు. ట్రైబల్‌ ‌మ్యూజియం ఏర్పాటుకోసం మంత్రి సీతక్కతో చర్చిస్తానని అన్నారు.

భక్తులకు వీఐపీ దర్శనం

ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు పర్యాటక శాఖ, దేవాదాయ శాఖ సహకారంతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన మూడు టెంపుల్‌ సర్క్యూట్‌లలో భక్తులకు వీఐపీ దర్శనం కల్పించనున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు కొండా సురేఖకు తెలిపారు.
వాటిలో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కొమురవెల్లి ఒక సర్క్యూట్‌లో, డిచ్‌పల్లి ఆలయం, బాసర, కామారెడ్డిలోని ఆలయాలు మరో సర్క్యూట్‌లో, మన్యంకొండ, శ్రీరంగాపూర్, అమ్మపల్లి, జోగులాంబ ఆలయాలు మరో సర్క్యూట్‌లో భాగం కానున్నాయి. వీఐపీ భక్తులకు వీడియోగ్రాఫర్, ఫొటోగ్రాఫర్, గైడ్ సౌకర్యాలు కల్పించడమే కాకుండా.. ఈ ఆలయాల్లో ఎక్కడికి వెళ్లినా భక్తులకు ఆలయ జ్ఞాపికను అందించి సత్కరిస్తామని తెలిపారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version