Tuesday, April 22Welcome to Vandebhaarath

TG Inter Results | బాలిక‌ల‌దే హ‌వా.. ఇంట‌ర్ ఫ‌లితాలు వెల్ల‌డి

Spread the love

TG Inter Results : తెలంగాణ (Telangana) ఇంటర్ (intermediate) వార్షిక పరీక్షల ఫలితాలు ఈరోజు అధికారికంగా విడుదలయ్యాయి. నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు (BIE) కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యాశాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంయుక్తంగా ఫలితాలను విడుదల చేశారు.

ఫ‌స్టియ‌ర్లో 65.96 శాతం ఉత్తీర్ణ‌త‌

ఈ ఏడాది ఇంట‌ర్ (Inter) ఫస్టియర్, సెకండియర్ రెండు సంవత్సరాలకూ పరీక్షలకు విద్యార్థుల భారీగా హాజరు కనిపించింది. ముఖ్యంగా బాలికలు గతం మాదిరిగానే ఈసారి కూడా తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఫస్టియర్ ఫలితాల విషయానికొస్తే మొత్తం 4,88,430 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 3,22,191 మంది ఉత్తీర్ణత సాధించగా మొత్తం ఉత్తీర్ణత శాతం 65.96 శాతం గా నమోదైంది. ఇందులో బాలికలు 73.83% ఉత్తీర్ణత సాధించగా, బాలురు 57.83 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇది బాలికల ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేస్తోంది.

సెకెండియ‌ర్‌లో 65.65 శాతం

ఇంట‌ర్ (Inter) సెకండియర్ పరీక్షల ఫలితాల్లో కూడా అదే దృశ్యం కనబడింది. మొత్తం 5,08,582 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 3,33,908 మంది ఉత్తీర్ణత సాధించి, 65.65 శాతం ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు. ఇందులో బాలికలు 74.21 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 57.31 శాతం తో పక్కనపడ్డారు. ఈ ఫలితాల్లో బాలికల విజయశాతం మళ్లీ ఎక్కువగా ఉండటం గమనార్హం.

TG Inter Results : పారద‌ర్శ‌కంగా ఫ‌లితాలు

ఇంటర్మీడియట్ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తులో కీలకమైన మైలురాయి. ఈ పరీక్షల ఫలితాలు వారి ఉన్నత విద్యాభ్యాస మార్గంలో కీలకంగా పనిచేస్తాయి. విద్యాశాఖ ఈసారి పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పాటించిందని, ఫలితాల ప్రకటన కూడా సమయానుకూలంగా జరిగిందని అధికారులు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ (https://tsbie.cgg.gov.in)ను సందర్శించొచ్చు. ఫలితాలను చూసేందుకు ఈ లింక్‌ను ఉపయోగించండి.

జూన్ 22 నుంచి అడ్వాన్స్

ఈ ప‌రీక్ష‌ల్లో ఫెయిలైన విద్యార్థుల‌కు మ‌రోసారి ప‌రీక్ష రాసే అవ‌కాశం ద‌క్క‌నుంది. 2025 జూన్ 22 నుంచి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌బోతున్నారు. ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు జూన్ 3 నుంచి 6 వ‌ర‌కు ఉంటాయి. అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు రాయాల‌నుకునే విద్యార్థులు ఏప్రిల్ 23 నుంచి 30 వ‌ర‌కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version